గాడిదలను సాకుతున్న ఐటీ ఉద్యోగి.. రూ.3,500 పలుకుతున్న లీటరు పాల ధర
Donkey Milk: గత కొంతకాలంగా యువత ఆలోచనలో మర్పు వస్తోంది.
Donkey Milk: గత కొంతకాలంగా యువత ఆలోచనలో మర్పు వస్తోంది. బతకడానికి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదని కష్టపడి పనిచ చేస్తే ఏ రంగంలో అయినా ఉపాధి పొందవచ్చని నిరుపిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ చదువుకు ఆలోచనలు, ఆధునికతను జోడించి విజయపథంలో ముందుకెళుతున్నారు. తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి కోవకే వస్తాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువకుడు. అయితే అందరిలా కోళ‌్లు, గొర్రెలు, మేకల పెంపకం చేయకుండా వినూత్నంగా గాడిదలను పెంచుతున్నాడు. లక్షలు సంపాదిస్తున్నాడు.
కోళ్లను పెంచుకునే వారిని చూసి ఉంటారు. గొర్రెలు, గేదెలను పెంచుకునేవారిని చూసి ఉంటారు. పందులను పెంచుకునేవారు అక్కడక్కడ ఉంటారు. కానీ వినూత్నంగా ఎక్కడా లేని విధంగా గాడిదలను పెంచుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు వీర వెంకట కిరణ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గాడిదల పెంపకం ద్వారా లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు.
కొంతకాలం ఐటీలో ఉద్యోగం చేసిన కిరణ్ కుమార్ కరోనా కారణంగా 2021లో సొంతూరుకు చేరుకున్నాడు. ఆ సమయంలోనే కొడుకుకు అనారోగ్య సమస్యలు ఉండటంతో గాడిద పాల గురించి తెలుసుకున్నాడు. గాడిద పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగడంతో పాటు ఈ పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసుకుని గాడిదలను పెంచాలన్న ఆలోచనకు వచ్చాడు. స్థానికంగా ఎవరూ గాడిదలను పెంచడం లేదు, వీటికి మార్కెట్‌లో డిమాండ్ ఉంది కాబట్టి పక్కా ప్రణాళికతో పెంపకం చేపడితే తప్పక లాభాలు దక్కుతాయని గుర్తించి ఓ ఐఐటీ విద్యార్ధి నవ్యతో కలిసి రాజానగరంమండలం, మల్లంపూడిలో పది ఎకరాల విస్తీర్ణంలో గాడిదల ఫామ్‌ను నెలకొల్పి పెంపకం ప్రారంభించాడు.
గాడిదలను పెంచడం వల్ల కలిగే ఉపయోగాలేమిటి? మార్కెట్‌లో ఎందుకు ఈ పాలకు ఇంత గిరాకీ? గాడిద పాలు తాగడం వల్ల నిజంగా ఆరోగ్యం మెరుగుపడుతుందా? అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పెంపకం ప్రారంభించాడు కిరణ్. గాడిదల్లోనూ వివిధ జాతులు ఉన్నాయని తెలుసుకుని పోషకాలు కలిగిన అధిక పాల దిగుబడి అందించే గాడిదలను సేకరించాడు. గుజరాత్, హర్యానాకు చెందిన హలారీ, మహారాష్ట్రకు చెందిన కాట్వాడి, ఇతియోపియాకు చెందిన టోక్యో బ్రీడ్‌లు ఇలా 120 గాడిదలు ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాయి.
లక్షల్లో ఆదాయం వచ్చే లక్షణమైన సాఫ్ట్ వేర్ కొలువును వీడి గాడిదలను పెంచుతానంటే మొదట కిరణ్ తల్లితండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తం చేశారు. కానీ కిరణ్ వెనుకంజ వేయలేదు. తాను అనుకున్న విధంగానే పెంపకం చేపట్టి విజయపథంలో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం కిరణ్ ఫామ్‌లో హలారీ, కాట్వాడి, టోక్యో బ్రీడ్‌లకు చెందిన సుమారు 120 గాడిదల ఉన్నాయి. గాడిదలకు వచ్చే రోగాలేమిటి? పెంచాలంటే ఎలాంటి వసతులు అవసరం. షెడ్డు ఎలా నిర్మించుకోవాలి ? వాక్సినేషన్ అందే విధానమేమిటనే విషయాలపైన పట్టు సాధించేందుకు బెంగుళూరులోని ఓ వెటర్నరీ అధికారి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. అనంతరం సురక్షితమైన పద్ధతుల్లో గాడిదలను పెంచుతున్నాడు.
ఒక్కో గాడిద రోజుకు 700 మిల్లీ లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి చేస్తుందని కిరణ్ తెలిపాడు. రెండు లేదా మూడు గంటలపాటు గాడిదలు పాలు ఇస్తాయని కానీ తాము ఆ విధంగా పాలు తీయడం లేదని కిరణ్ అంటున్నారు. ఒక గంట మాత్రమే గాడిద నుండి పాలు తీస్తామని, మిగిలిన రెండు గంటలు వాటి పిల్లలకు వదిలేస్తామని తెలిపాడు. పాలు తక్కువగా దొరుకుతున్నందునే అధిక ధరకు పాలను అమ్ముతున్నామని వివరించాడు. పాలు పితకడం, వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం, మేత అందించడం వంటి పనుల కోసం స్థానికంగా ఉండే 10 మందికి ఉపాధి కల్పించాడు.
రోజుకు 30 లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. హైదరాబాద్, బెంగుళూరులోని సబ్బుల ఫ్యాక్టరీలకు పాలను విక్రయిస్తున్నాడు కిరణ‌్. గాడిద వ్యర్థాలను వృధాగా పోనీయడం లేదు. వీటికి మార్కెట్‌లో ఎంతో గిరాకీ ఉంటుందని చెబుతున్నాడు కిరణ్. ఔషధ గుణాలు,పోషకాలు అధికంగా ఉండడం వలన ప్రజలకు గాడిద పాలను విక్రయిస్తున్నామని కిరణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాలు తక్కువ ఉత్పత్తి అవుతున్నాయి కబట్టే అధిక ధర పలుకుతోందన్నాడు.
కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ పోషకాలు పుష్కలంగా కలిగిన ఆహారాలు తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నంలో మునిగిపోయారు. అయితే ఈ మధ్య చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు గాడిద పాలు తాగుతున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల గాడిద పాల లభ్యత పెరుగుతోంది. గాడిద పాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం ఉంది.
నిజానికి గాడిద పాలు తాగితే మంచిదనే మాట ఇప్పటిదేమీ కాదు మన పూర్వీకులు వీటిని తాగడం మంచిదని దశాబ్దాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా పసి పిల్లలు గాడిద పాలు తాగడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే , గాడిత పాలు తల్లి పాలకు సమానం అని అంటారు. గాడిద పాలల్లో ఔషధ గుణాలతో పాటు ఛర్మ సౌందర్యాన్ని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్‌లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే గాడిద పాలను శిశువులకు పట్టించడం మంచిదని అంటున్నారు. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్ డి ఎక్కువగా అందుతుంది. అర్థరైటిస్, దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు. ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రోటీన్లు కలిగి ఉంటాయి.
గేదెలు, ఆవులు పెంచేవారు గాడిదలను పెంచుకుంటే అదనపు ఆదాయం సమకూరుతుందని పెంపకందారు నవ్య తెలిపారు. పెంపకం చేపట్టే ప్రతి ఒక్కరు తమ సొంత మార్కెట్‌ను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో తొలిసారిగా గాడిదల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని ఈ యువకుడు చెబుతున్నాడు. గాడిత పాల ఉత్పత్తితో పాటు వాటి మూత్రం, పేడతో అనుబంధ ఉత్పత్తుల తయారీవైపు నా ప్రయాణం సాగుతోందని తెలిపాడు. తోటి యువకులను స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.