పూల సాగులో మహబూబ్‌నగర్ జిల్లా రైతులు
Mahbubnagar: వ్యవసాయం అంటే ఆరుగాలం కష్టించి పనిచేయాల్సిందే అయినా పంట చేతికొచ్చే సమయానికి కొన్నిసార్లు ప్రకృతి ప్రకోపానికి గురి కావాల్సి వస్తుంటుంది.
Mahbubnagar: వ్యవసాయం అంటే ఆరుగాలం కష్టించి పనిచేయాల్సిందే అయినా పంట చేతికొచ్చే సమయానికి కొన్నిసార్లు ప్రకృతి ప్రకోపానికి గురి కావాల్సి వస్తుంటుంది. ఆ గండం దాటి దిగుబడులు చేతికొచ్చినా సొంతంగా మార్కెట్ చేసుకోలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో దళారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. చేసిన శ్రమకు వెల అటుంచి చేసిన అప్పులు తీరితే అదే పదివేలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీనికి తోడు వరి వేస్తే ఉరే అంటూ కొత్త ప్రచారం అందుకే అంతా ఒకే రకమైన పంటల సాగు చేయకుండా సీజన్‌కు అనుగుణంగా మార్కెట్ అవసరాలకు తగ్గట్లు డిమాండ్ మేరకు పంటలు పండిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన పాలమూరు యువ రైతులు బంతిసాగుతో లాభాల బాటన పయనిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరు, వెంకటేశ్వర తాండాతో పాటు పరిసర ప్రాంత గ్రామాల్లో విస్తృతంగా బంతి సాగవుతోంది. ఇక్కడి యువరైతులు మార్కెట్ లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, కంది, పత్తి తదితర పంటల సాగుకు గుడ్‌బై చెప్పి బంతి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. నాలుగేళ్ల క్రితం కేవలం అర ఎకరంలో మాత్రమే సాగులో ఉన్న బంతి ప్రస్తుతం విస్తారంగా సాగులో ఉంది. సీజన్ కు అనుగుణంగా దిగుబడి వస్తుండటంతో రైతులు లాభాల బాటన పయనిస్తున్నారు.
పూలకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. పెళ్లిల్లైనా పేరంటమైనా పండుగలు వచ్చినా పూలతో పూజ చేయడం దేవాలయాల్లో అలంకరణ చేయడం పరిపాటి. అందులోనూ బంతిపూలకు ఉన్న గిరాకీనే వేరు. ముఖ్యంగా తెలంగాణలో చేసే పూల వేడుకైన బతుకమ్మలో బంతిపూలు లేనిదే బతుకమ్మలను పేర్చరు మహిళలు ఆ తరువాత వినాయక చవితి మొదలు దసరా, దీపావళి, కార్తీక మాసం, అయ్యప్ప పూజలు, శివ స్వాముల ఉత్సవాలకు బంతిపూలు వాడుతుంటారు. అందుకే ఈ గిరాకీని గుర్తించి బంతిపూల సాగుకు జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతోంది.
పూర్వం రైతులు తమ పంటపొలాల్లో వరి, ఇతర సాంప్రదాయ పంటలు సాగుచేస్తూ మిగిలిన ఒకటి రెండు కుంటల భూమిలో పూలు, కూరగాయలు పండించేవారు. కానీ ఇపుడు పరిస్థితి తారుమారైంది. ప్రధాన పంటలుగానే పూలు, కూరగాయల సాగును చేపడుతున్నారు. కొన్నేళ్లుగా రైతులు సంప్రదాయ పంటలు వదిలేసి కొత్త పంటల వైపు చూస్తున్నారు. అలాంటి వాటిలో బంతిపూల సాగు ప్రత్యేకమైనది. బంతిపూల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు పూల దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ లో ధర కూడా ఆశాజనకంగా ఉంటుంది. సీజన్‌ని బట్టి ధర ఎక్కువ, తక్కువ ఉంటుంది. ఎకరా విస్తీర్ణంలో వచ్చే పూల దిగుబడితో సీజన్‌లో అత్యధికంగా పెట్టుబడిపోనూ రెండున్నర లక్షల రూపాయల వరకు లాభం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
బంతిపూలలో ప్రధానంగా ఆఫ్రికా, ఫ్రెంచ్ అని రెండు రకాలు ఉంటాయి. పెద్దగా ఉండే ఆఫ్రికా జాతి పూలకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఈ పూలు సంవత్సరమంతా పూస్తాయి అయితే ఉష్ణోగ్రత్తలు 35 డిగ్రీలకు మించకుండా ఉంటే మంచి దిగుబడి లభిస్తుందని రైతులు చెబుతున్నారు. బంతిపూల మొక్కలు అన్ని రకాల నేలల్లో పెరుగుతాయి. మొక్కలను నాటిన 40 నుంచి 50 రోజుల తర్వాత పూల దిగుబడి లభిస్తుంది. ఒక్కో మొక్కకు 100 నుంచి 150 వరకు పూలు వస్తాయి. సంప్రదాయ పంటలకంటే పూలసాగే బాగుందంటున్నారు పాలమూరు రైతులు. ప్రతి నెల లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు.