Mad Gardener: మ్యాడ్ గార్డెనర్ మాధవి.. మట్టిలేని మిద్దె సేద్యం..

Mad Gardener: నగరాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్నాయి.

Update: 2021-08-21 05:49 GMT

Mad Gardener: మ్యాడ్ గార్డెనర్ మాధవి.. మట్టిలేని మిద్దె సేద్యం..

Mad Gardener: నగరాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. పర్యావరణం కలుషితమవుతోంది. ఇదే క్రమంలో రసాయనాల సమ్మిళితంతో మార్కెట్‌లో లభిస్తున్న ఆహార ఉత్పత్తుల కారణంగా ఆరోగ్యకరమైన జీవితం అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో పర్యావరణంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మిద్దె వనాలే అసలైన మార్గాలని రుజువు చేస్తున్నారు విశాఖ వాసి మాధవి. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న మాధవికి చిన్నప్పటి నుంచి మొక్కలంటే అమితమైన ఇష్టం. అదే ఆసక్తి నేడు తన ఇంటినే ఓ నందనవనంగా మార్చే సాధనంగా మారింది.

ఇంటికి అవసరమైన కూరగాయలును సొంతంగా సాగు చేయడంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మాధవి. సాగులో మెలకువలను చెబుతూ సామాజిక మాధ్యమాలలో ఎంతో మంది మన్నణలను పొందుతున్నారు. గృహిణిగా తన బాధ్యతలతో తలమునకలైనా మొక్కల పెంపకం ఎప్పుడూ ఆపలేదంటున్నారు ఈ సాగుదారు. మొదట్లో ఇంటికి అవసరమైన రెండు మూడు రకాల కూరగాయల మొక్కలు సాగు చేసేవారు. పిల్లలు ప్రస్తుతం పెద్దవాళ్లు అయ్యారని కాస్త తీరిక దొరకడంతో మరింత ఎక్కువ సమయాన్ని మేడపైన మొక్కల పెంపకం ముఖ్యంగా కూరగాయల పెంపకానికే కేటాయిస్తున్నారు.

రసాయనాలతో కూడిన ఎరువులు ఉపయోగించకుండా, తానే సొంతంగా ఎరువులు తయారుచేసి మొక్కలకు అందిస్తున్నారు ఈ మిద్దె సాగుదారు. మేడమీద ప్రయత్నించని పంటంటూ ఏమీ లేదని అంటున్నారు. బీర, సొర, కాకర వంటి పొద జాతి మొక్కలతో పాటు పచ్చిమిర్చి, టమోట, మునగ, బంగాళదుంపులు ఇలా అనేక రకాల కూరగాయలను పండిస్తున్నారు మాధవి. కొన్ని పంటలు ప్రయోగాత్మకంగా పండించినా అంతగా సక్సెస్ కాలేదని చెప్పుకొచ్చారు. తనను చూసి కొంతమందైనా స్ఫూర్తి పొంది కూరగాయలు సాగు చేస్తే చాలంటున్నారు. అనుభవంలోకి వస్తే తప్ప మిద్దె తోటల ద్వారా ఎంత ఆనందనం పొందవచ్చో తెలియదని తెలిపారు.

పిల్లలు మేడపైన చదువుకునేప్పుడు మొక్కల మధ్య ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని , వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని తనతో పాటే వాళ్లకు తోట పనులు అలవాటు చేస్తున్నానని చెబుతున్నారు మాధవి. ఖర్చు గురించి ఆలోచన లేదని ప్రారంభంలో పెట్టుబడి తప్ప మరో ఖర్చు ఉండదంటున్నారు. సేంద్రియ విధానంలో ఇంటిపట్టునే మనమే మన ఆహారాన్ని పండించుకోవడం వల్ల ఖర్చుతో పాటు రుచి కూడా బాగుంటుందని మాధవి అభిప్రాయపడుతున్నారు. అందుకే 365 రోజులు మేడమీద పండిన కూరలు తినాలనే ఉద్దేశంతో కాలానుగుణంగా పెంచుతున్నానని తెలిపారు. అదే విధంగా బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా కొత్తరకం విత్తనాలు, మొక్కలు కనిపించినా వాటిని తీసుకొచ్చి పెంచుతున్నారు.

కొత్తగా టెర్రస్ గార్డెన్‌ను ప్రారంభించేవారు మట్టికి బదులుగా తక్కువ బరువగల మిశ్రమాలు అంటే కోకోపిట్, వర్మికంపోస్ట్‌ ను ఉపయోగించి పంటలు పెంచుకోవాలని సూచిస్తున్నారు మాధవి. అదే విధంగా ప్రతి రోజు మొక్కలకు నీరు అందించాల్సిన పనిలేదని మట్టిలో తేమ ఉంటే చాలని చెబుతున్నారు. ఈ పద్ధతుల్లో మిద్దె తోటలు ఏర్పాటు చేసుకుంటే నీరు ఆదా అవ్వడంతో పాటు స్లాబు పాడవకుండా ఉంటుందంటున్నారు.

తోటపని ఆందోళనను దూరం చేస్తుంది ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏకాగ్రతకు దారి చూపుతుంది. అన్నింటికి మించి ఆరోగ్యాన్ని, సంతృప్తినీ, సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు విశాఖపట్నం వాసి మాధవి. ఇదే స్ఫూర్తితో మరింతమంది మిద్దె సాగుకు ముందుకు రావాలంటున్నారు. 

Full View


Tags:    

Similar News