ఇంజనీరింగ్ విద్యార్ధి అద్భుత సృష్టి...సోలార్ పవర్‌తో నడిచే యంత్రాన్ని...
సంకల్పం అనే ఇందనం రగిలితే తపన ప్రజ్వరిల్లితే ఆశయాలు రెక్కలు తొడిగితే..ఆకాశమే హద్దుగా యువత చెలరేగిపోతుంది. చేతులే తెడ్డుగా కల్లోల కడలిని సైతం ఈదేస్తుంది. పుట్టిన ఊరికి తనను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు తాను పొందిన ప్రతిభతో ఏదో చేయాలన్న తపనతో నూజివీడుకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి సరికొత్త యంత్రానికి ప్రాణం పోసాడు. అతి తక్కువ ఖర్చుతో సోలార్ సాయంతో నడిచే యంత్రాన్ని రూపొందించాడు. అందరిమన్ననలను పొందుతున్నాడు. మరి ఈ యువకుడు రూపొందించిన యంత్రం ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
కృష్ణా జిల్లా నూజివీడు మండలం దిగవల్లి గ్రామానికి చెందిన దొంతిరెడ్డి యోగేంద్రరెడ్డి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. యోగేందర్ రెడ్డి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. దీంతో నిత్యం వారు సాగు పనుల్లోనే నిమగ్నమైపోతుండేవారు. అందులో ఉన్న వ్యయప్రయాసలను, కష్టనష్టాలను గుర్తించిన యోగేందర్...తన తల్లి దండ్రుల కష్టాలను తీర్చేందుకు తను నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఓ యంత్రాన్ని రూపొందించాడు. అదే పౌల్ట్రీ మెన్యూర్ స్క్రాపర్.
దిగవల్లి ప్రాంతంలో బాయిలర్ కోళ్ళ పెంపకందారులు అధికంగా ఉన్నారు. తన తండ్రి కూడా పౌల్ట్రీని నిర్వహించేవారు. ప్రధానంగా కోళ్ళ ఫారాలలో కూలీల కొరత ఎక్కువగా వుంటుంది. దానిని అధిగమించడానికి పౌల్ట్రీ మెన్యూర్ స్క్రాపర్ యంత్రాన్ని సృష్టించాడు. ఈ పరికరం సోలార్ విద్యుత్‌తో పనిచేస్తుంది.
చిన్న తనం నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసే వరకు తన తండ్రి రెక్కల కష్టంపై ఆధారపడ్డ యోగేంద్ర..నేడు రైతుకు ప్రేమతో అని ఈ యంత్రానికి నామకరనం చేసి తోటి రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నాడు. సాధారణంగా పల్లెల్లో విద్యుత్ కొరత అధికంగా ఉంటుంది. అందుకే సూర్యకాంతిని గ్రహించి పని చేసే విధంగా సోలార్ పవర్ సాయంతో ఈ యంత్రాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.
వీటి తయారీకి చాలా తక్కువ పెట్టుబడి మాత్రమే అవడంతో వీటికి డిమాండ్ పెరిగింది. గ్రాస్‌కట్టర్, రూమ్‌హీటర్, కోళ్ళ పెంపకంలో లిట్టర్ తొలగింపు, సోలార్ టార్చ్ వంటి పనులను ఈ యంత్రంతో ఎంతో సునాయాసంగా చేయవచ్చు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేసి అద్భుతాలు సృష్టిస్తానని యోగేంద్రరెడ్డి చెబుతున్నాడు.