Lipstick Seeds: లాభాలు కురిపిస్తున్న లిప్‌స్టిక్ తయారీ గింజలు..
Lipstick Seeds: మగువల పెదవులకు మరింత అందాన్ని తెస్తుంది లిప్‌స్టిక్.
Lipstick Seeds: మగువల పెదవులకు మరింత అందాన్ని తెస్తుంది లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ వేసుకుంటే అమ్మాయిల పెదాలు ఎర్రగా నిగనిగలాడతాయి. మరి ఈ లిప్‌స్టిక్‌ను దేంతో తయారు చేస్తారు? లిప్‌స్టిక్ ఎర్రటి రంగు రావటానికి ఏం వాడతారు. అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. లిప్‌స్టిక్ కు ఆ ఎర్రటి రంగు రావటానికి ఓ రకమైన గింజల్ని ఉపయోగిస్తారు. ఎర్రగా కనిపించే ఆ గింజల వల్లే లిప్‌స్టిక్ కు రంగు వస్తుంది అవే జాఫ్రా గింజలు. ఈ జాఫ్రా గింజలను పశ్చిమగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతం అయిన బుట్టాయగూడెం ఓ రైతు ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. తొలి ప్రయత్నంలోనే చ్కటి దిగుబడిని అందుకుని లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొత్తరకం సాగుకు గిరిజన రైతు శ్రీకారం చుట్టారు. లిప్‌స్టిక్ గింజలుగా పేర్గాంచిన జాఫ్రా పంట సాగు మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే సత్ఫలితాలు సాధించారు. బుట్టాయగూడెం మండలం దాసయ్యపాలెం గ్రామానికి చెందిన మడకం జంపాలరావు సుమారు 30 ఏళ్లుగా ఎన్నో రకాల పంటలను పండిస్తున్నారు. అయితే ఎన్ని పంటలు సాగు చేసినా లాభాలు లేక నష్టాలనే చవిచూశారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి, విశాఖ మన్య ప్రాంతంలో పర్యటించిన సమయంలో జాఫ్రా పంట సాగు గురించి తెలుసుకున్నారు. ఈ సాగు అతడిని ఎంతగానో ఆకర్షించింది. తాను కూడా ఈ పంటను పండించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రయోగాత్మకంగా మూడు ఎకరాల్లో జాఫ్రా గింజల సాగు ప్రారంభించి లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
జాఫ్రా మొక్కలు కొండలు, గుట్టల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి. ఈ గింజలను లిప్‌స్టిక్, సౌందర్య సాధనాలు, ఫుడ్ కలర్స్, ఆహా ఉత్పత్తులు, మందుల తయారీకి వినియోగిస్తారు. అయితే ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని అమెరికా వంటి దేశాలు నిషేధించడంతో జాఫ్రా గింజలకు గిరాకీ బాగా పెరిగింది. జాఫ్రా గింజల వినియోగం కూడా పెరగడంతో ఈ పంట వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంది.
ఇప్పటి వరకు చేసిన కష్టాల సాగుకు సెలవు పలికి వివిధ ప్రాంతాలు సందర్శించి 160 మొక్కలను సేకరించి ఎకరాకు 160 చొప్పున మూడు ఎకరాల్లో జాఫ్రా మొక్కలు నాటారు. పంట ప్రారంభం నుంచి మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా కనిపించింది. సాధారణంగా పంటలు 14 నెలలకు చేతికి అంది వస్తుంది. కానీ ఈ రైతు పొలంలో తొమ్మిదో నెలకే 10 క్వింటాళ్ల వరకు దిగుబడి లభించడంతో రైతు ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం మూడెకరాల్లో పంటలను సాగు చేస్తున్న ఈ రైతు వచ్చే ఏడాది 20 ఎకరాల్లో పండించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కొత్త పంట కావడం పంట దిగుబడి బాగుండటంతో తోటి రైతులు జాఫ్రా పంట సాగు వివరాలను తెలుసుకునేందుకు జంపాలరావు పొలాన్ని సందర్శిస్తున్నారు. తమ పొలంలోనూ ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ అధికారులు పంట సాగుపై మెళకువలు నేర్పించి ఐటీడీఏ ద్వారా పంటను కొనుగోళ్లు జరిపిస్తే మరింత మంది గిరిజనులు జాఫ్రా సాగుకు ఆసక్తి చూపుతారంటున్నారు ఈ రైతు.