ఆకుకూరల సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న రామానుజవరం గ్రామం
Leafy Vegetables Cultivation: ఆ ఊరంతా ఆకుకూరలే పండిస్తారు. ఎటూ చూసినా ఆకుకూరల తోటలు పరుచుకున్న పచ్చదనమే ప్రతిబింభిస్తుంది.
Leafy Vegetables Cultivation: ఆ ఊరంతా ఆకుకూరలే పండిస్తారు. ఎటూ చూసినా ఆకుకూరల తోటలు పరుచుకున్న పచ్చదనమే ప్రతిబింభిస్తుంది. మూడు దశాబ్దాలుగా ఇక్కడి వారికి ఇదే వ్యాపకం, జీవనాధారం. తక్కువ పెట్టుబడితో సేంద్రియ విధానాలను అనుసరించి ఆకుకూరలు పండిస్తూ చుట్టుపక్కన నాలుగు మండలాలకు సరఫరా చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు గ్రామ రైతులు. లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆకుకూరలకు ప్రసిద్ధిగాంచిన రామానుజవరం గ్రామంపై ప్రత్యేక కథనం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రామానుజవరం ఆకుకూరల సాగుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ గ్రామంలోని ప్రజలు ఆకుకూరల సాగునే ప్రధాన జీవనాధారంగా మలచుకొని మూడు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో ఆడ, మగ, ముసలి ,ముతక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆకుకూరలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. భూమికి పచ్చని రంగేసినట్లుగా హరితవర్ణంతో ఆహ్లాదకరంగా కనబడుతాయి గ్రామంలోని తోటలు. ఇక్కడ పండని ఆకుకూరంటూ ఉండదు. చుక్కకూర, పాలకూర, పొన్నగంటి కూర, మెంతికూర, ఎర్ర గోంగూర వంటి రకరకాల ఆకుకూరలు పండిస్తారు రైతులు. పరిసర ప్రాంత ప్రజలకు నిత్యం తాజా ఆకుకూరలను సరఫరా చేస్తూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు.
ఆకుకూరల సేద్యంలో ఎలాంటి రసాయనిక ఎరువులను వినియోగించడం లేదు ఈ గ్రామ రైతులు. సేంద్రియ ఎరువులను మాత్రమే వాడి ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. తమకున్న కొద్దిపాటి స్థలంలోనే అనేక రకాల ఆకుకూరలను పండిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ధరకు తక్కువగానే ఆకుకూరలు వినియోగదారులకు అందిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఆకుకూరలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రతి నెల నికర ఆదాయం ఆకుకూరల ద్వారా లభిస్తోందని రైతులు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ప్రతి నెల నికర ఆదాయాన్ని ఆకుకూరల ద్వారా పొందుతూ తోటి గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు రామానుజవరం రైతులు.