Farmers Facing Problems: రైతులను వెంటాడుతున్న కష్టాలు.. పంట చేతికి వచ్చే సరికి పడిపోయిన ధరలు

Update: 2020-08-13 05:09 GMT

Farmers Facing Problems: ఉల్లిని కోస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ రాయలసీమ రైతులను ఉల్లిని కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. పతనమైన ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం ధర పెరుగుతుందని ఆశపడ్డ ఉల్లి రైతులకు భంగపాటు మిగిలింది. కష్టంచి పండిచిన పంటకు మద్దతు ధర లభించడం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీ భారంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఊహించని ఉపద్రవం రైతన్నలను ఆవేదనకు గురి చేస్తుంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను తట్టుకుని, శ్రమించి పంటలు పండిస్తే కరోనా కాటు వేసింది. పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా చేసింది.కర్నూలు జిల్లాలో ప్రధాన పంటగా ఉల్లిని సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు లక్ష మంది రైతులు ఉల్లి పంట సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర 4 రూపాయల నుండి 8 రూపాయల లోపు ఉండటంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. వేలు, లక్షలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లి అనేక ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా నిల్వలు ఉండటంతో కర్నూలు ఉల్లికి ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని ఉల్లి వ్యాపారులు అవకాశంగా మార్చుకుంటున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ కొనుగోలు వ్యవహారం మార్కెట్‌ అధికారులు చూస్తుండగానే జరుగుతుందని రైతులు వాపోతున్నారు. పంట దిగుబడి ఎక్కువగా వచ్చిన సమయంలో ధరలు అమాంతంగా పడిపోవడం, పంట దిగుబడి తక్కువగా వచ్చినప్పుడు ధరలు ఆకాశాన్ని అంటడం పరిపాటిగా మారిపోయింది. అయితే పంట తో సంబంధం లేకుండా శాశ్వత ధరను నిర్ణయించాలని ఉల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News