ట్యాంకుల్లో కొర్రమేనులు.. లాభాల సిరులు..

Fish Farming: పట్టుదల ముందు ఓటమి బలాదూర్ అని నిరూపించాడో రైతు.

Update: 2022-08-10 10:13 GMT

ట్యాంకుల్లో కొర్రమేనులు.. లాభాల సిరులు..

Fish Farming: పట్టుదల ముందు ఓటమి బలాదూర్ అని నిరూపించాడో రైతు. అపజయాలను చవిచూసిన చోటే విజయానికి బాటలు వేసుకున్నాడు. తెల్లరకం చేపల పెంపకంలో నష్టాలు రావడంతో కష్టాలు ఎదుర్కొన్న ఆ రైతు నిరుత్సాహంతో వెనుతిరుగలేదు. స్నేహితులు ఇక ఈ రంగానికి స్వస్తి పలకాలని సలహా ఇచ్చినా పట్టించుకోలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా లోపం ఎక్కడుంతదో అన్వేషించాడు. ఆ పొరపాట్లను సరిచేసి నేడు చేపల పెంపకంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

నల్గొడ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన తూడి శ్రీనివాస్ రెడ్డి కొర్రమేను సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన ఇంటి ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్విమింగ్ పూల్ లో ముందు రవ్వ, బొచ్చ వంటి చేపల పెంపకం చేపట్టారు. అయితే పరిమితికి మించి తెల్లరకానికి చెందిన చేపలు పెంచడంతో పాటు ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులకారణంగా తొలి ప్రయత్నంలోనే నష్టాలను చవిచూశారు శ్రీనివాస్ రెడ్డి. ఈ రంగం కష్టమైందని రాణించలేవని కొంత మంది స్నేహితులు సలహా ఇచ్చినా పట్టించుకోలేదు. ఇదే రంగంలో రాణించాలన్న ధృడసంకల్పంతో చేపల పెంపకంలో లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని ,అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రస్తుతం కొర్రమేను చేపలను పెంచుతున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు.

ఇంటి ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ కు అనుబంధంగా పది సిమెంట్ ట్యాంకులను నిర్మించారు. రెండు అంగుళాల కొర్రమేను పిల్లలను ట్యాంకుల్లో వేసి పెంచుతారు. ఆ తరువాత పెరిగిన చేప పిల్లలను దశల వారీగా సిమెంట్ ట్యాంకుల్లో మార్చుతూ విజయవంతంగా పెంపకం చేపడుతున్నారు. చేపలకు క్రమం తప్పకుండా మేత వేస్తుండడంతో తొమ్మిది నుంచి పదినెలల వ్యవధిలోనే కిలో సైజు వరకు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాసరెడ్డి. మొదట్లో కొర్రమేను సాగులో ఇబ్బందులు పడ్డానని , కానీ గత మూడు సంవత్సరాలుగా ఈ సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నాని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కొర్రమేను పెంచుతున్న ట్యాంకుల్లోని నీటిలో 15 రోజులకు ఒకసారి ఉప్పు, పసుపు, వేపనూనె కలుపుతున్నారు. తద్వారా చేప పిల్లలు వ్యాధుల భారిన పడకుండా సహజసిద్ధంగా పెరుగుతాయని తెలిపారు. వారానికి ఒకసారి చేపల ట్యాంకుల్లోని నీటిని మార్చడం వల్ల చేపలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు శ్రీనావాస్‌ రెడ్డి. ఎండవేడిమి నుంచి చేపలను రక్షించేందుకు వీలుగా ట్యాంకులపై తెరలను ఏర్పాటు చేశారు.

ఒక్కో చేప కిలో బరువు వచ్చే వరకు పెంచేందుకు 200 రూపాయల వరకు ఖర్చు అవుతోందని రైతు తెలిపారు. స్థానికంగా ఉన్న మిర్యాలగూడ మార్కెట్ లోనే చేపలు విక్రయించే సౌకర్యం ఉండడంతో అక్కడ 350 నుంచి 400 వందల వరకు కిలో చేపలను అమ్ముతున్నానన్నారు. దీంతో కేజీకి ఎంత లేదన్నా 150 రూపాయల వరకు లాభం వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస్‌ రెడ్డి చేస్తున్న చేపల పెంపకాన్ని చుట్టుపక్కల రైతులు చూసి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా కొర్రమేను చేపల పెంపకాన్ని ప్రారంభించి సత్పలితాలను పొందుతున్నారు. కష్ట నష్టాలను చూసిన చోటనే ప్రస్తుత లాభాలు పొందుతూ ‌శ్రీనివాస్‌ రెడ్డి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Full View


Tags:    

Similar News