Korameenu Fish: కొర్రమీను పెంపకంలో రాణిస్తున్న యువరైతు
Korameenu Fish: కొర్రమీను చేపల సాగులో రాణిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన యువరైతు పొనుగోటి కన్నారావు.
Korameenu Fish: కొర్రమీను చేపల సాగులో రాణిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన యువరైతు పొనుగోటి కన్నారావు. ఓ స్వచ్ఛంద సంస్థకు తనసేవలను అందిస్తున్న కన్నారావు వ్యవసాయం మీద ఉన్న ఇష్టంతో హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఎల్లగిరి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. గత నాలుగేళ్లుగా పండ్లు, కూరగాయ తోటలను సాగు చేస్తున్నాడు ఈ యువరైతు. ఇందులో సత‌్ఫలితాలను సాధిస్తున్న ఈ సాగుదారు నిపుణుల సూచనల మేరకు ప్రయోగాత్మకంగా మొదటిసారిగా కొర్రమీను చేపల పెంపకాన్ని ప్రారంభించాడు. గత ఏడాది డిసెంబరులో 10 గుంటల భూమిలో సహజ పద్ధతుల్లో చెరువును ఏర్పాటు చేసుకుని 5 వేల చేపలను పెంచుతున్నాడు. ప్రస్తుతం అవి పట్టుబడికి వచ్చి రైతుకు చక్కటి ఆదాయాన్ని అందిస్తున్నాయి.
చేపల పెంపకంలో కొత్త కొత్త పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా అవేమీ ఈ రైతును ఆకర్షించలేదు. పూర్తి సహజ పద్ధతులనే అనుసరిస్తున్నాడు కన్నారావు. చేపల చెరువును తవ్వుకున్న తరువాత చేపలు వేసే ముందు గుంటలో 10 కిలోల తవుడు, 10 కిలోల శనగ చెక్క, నాలుగు కిలోల బెల్లం వేశాడు. తద్వారా చెరువులో చిన్న చిన్న పురుగులు ఏర్పడి అవి చేప పిల్లలకు ఆహారం అవుతాయంటున్నాడు. ఈ విధానం వల్ల ఫీడ్ ఖర్చు కూడా కాస్త తగ్గుతుందంటున్నాడు కన్నారావు. ముఖ్యంగా చేపలకు సరైన దాణా అందించినట్లైతే అవి ఏడు నెలలకే కేజీ వరకు బరువుకు వస్తాయని అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. ప్రస్తుతం 5 వేల చేపలకు 3 వేలే పట్టుబడికి వచ్చినా వాటి ఎదుగుదల బాగుండటం వల్లే లాభాలు అందుతున్నాయని హర్షంవ్యక్తం చేస్తున్నాడు ఈ రైతు. దాణా సక్రమంగా అందిస్తే కొర్రమీను పెంపకంలో రైతు పంట పండినట్లే నని అంటున్నాడు. ముఖ్యంగా నిపుణుల సూచనలు తీసుకుని చిన్ని చిన్న మెళకువలు పాటిస్తే చేపల పెంపకంలో ఎవరైనా రాణించవచ్చంటున్నాడు.
చేప పిల్లలు వ్యాధుల బారిన పడకుండా సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నాడు కన్నారావు. చేపలను చెరువులో వదిలిన 15 రోజులకు కళ్లుప్పు, పసుపును చెరువులో కలుపుతున్నాడు. మరో 15 రోజులకు వెల్లుల్లి మిశ్రమాన్ని వేస్తున్నాడు. ఆ తరువాత వేపాకు రసాన్ని కలుపుతున్నాడు. ఇలా ఈ మూడు పద్ధతులను అనుసరించడం వల్ల ఇప్పటి వరకు చేపలు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదని ఈ పెంపకందారు చెబుతున్నాడు. ఎంతో ఆరోగ్యంగా చేపలు పెరుగుతుండటం తనకు ఎంతో కలిసివస్తుందంటున్నాడు.
ఎలాంటి చేపల పంపకం చేపట్టాలి ? ఏ చేపల పెంపకం ఖర్చుతో కూడుకున్నది? ఏ ఏ చేపలు లాభాలను అందిస్తాయి? అనే అంశాలపై చాలా మంది రైతులకు అవగాహన ఉండదు. అయితే కొర్రమీనులో మాత్రం ఫీడ్ సక్రమంగా అందిస్తే తప్పనిసరి లాభాలు సొంతం చేసుకోవచ్చంటున్నాడు కన్నారావు. స్థానికంగా మార్కెట్ లేకున్నా హైదరాబాద్‌లో మంచి డిమాండ్ ఉందంటున్నాడు ఈ రైతు. మంచి బరువున్న చేపలకు అధిక ధర లభిస్తుందని చెబుతున్నాడు. మోర్టాలిటీ శాతాన్ని తగ్గించుకుంటే కొర్రమీను చేపల పెంపకంలో రైతు సత్ఫలితాలను సాధించవచ్చంటున్నాడు.
సామాజిక మాధ్యమాల్లో పెంపకాన్ని చూసి చాలా మంది రైతులు అవగాహన లేకుండా పెద్ద ఎత్తున చేపలను పెంచుతున్నారని అది సరైన విధానం కాదంటున్నాడు ఈ రైతు. ఈ రంగంలో రాణించాలంటే ప్రయోగాలు కాదని పరిశీలన అవసరమంటున్నాడు. నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ప్రత్యక్ష్యంగా చేపల పెంపకం జరుగుతున్న క్షేత్రాలను సందర్శించి సాగుపై పట్టు సాధించాలంటున్నాడు.