దేశంలో మాంసాహారం తినేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో చికెన్ చాలా రొటీన్ ఫుడ్ అయిపోయింది. అందులోనూ నాటు కోళ‌్ళకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది సన్న చిన్న కారు రైతులు సైతం డిమాండ్ కు తగ్గట్టుగా నాటు కోళ్ళను పెంచుతూ ఉపాధితో పాటు కాస్త డబ్బును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు ఎంఎన్‌సీ కంపెనీలోని ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి నాటు కోళ్ళ పెంపకం వైపు అడుగులు వేశాడు తాను వేసిన ఆ ఒక్క అడుగే నేడు ఎంతో మందికి ముందడుగుగా మారింది. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న దేశీ కడక్‌నాథ్ కోళ్ళ పెంపకంలో రాణిస్తున్నాడు యువరైతు ప్రదీప్.
నాటు కోళ్ళ పెంపకం నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటు కోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు కాస్త డబ్బును సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటి కోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది. ఈ క్రమంలోనే నాటు కోడిని తలదన్నేలా కడక్‌నాథ్ కోళ్ళ పెంపకాన్ని చేపట్టి లాభాల దిశలో పయనిస్తున్నాడు కృష్ణా జిల్లాకు చెందిన యువరైతు ప్రదీప్ ఉన్నత చదువులు చదువుకుని లక్షల్లో జీతం ఆర్జిస్తున్నా అక్కడ పొందలేని సంతృప్తిని ఇక్కడ పొందుతున్నాడు పలువురికి ఉపాధిని కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మొదట గుడివాడలో10 సెంట్ల స్థలంలో కడక్‌నాథ్ కోళ్ళ పెంపకం ప్రారంభించాడు ప్రదీప్. ఆ తరువాత కష్టనష్టాలను లాభాలను స్వయంగా చూడడంతో పెంపకంలోనూ, మార్కెటింగ్ లోనూ పట్టు సాధించాడు దీంతో విజయవాడలోని నున్న ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకుని షెడ్డు నిర్మాణం చేపట్టి కోళ‌్ళ పెంపకం కొనసాగించాడు. తానే కాదు తనను చూసి కొత్తగా ఫార్మ్ పెట్టాలనుకునే వారితో ఒప్పందం చేసుకుని చిక్స్‌ను సరఫరా చేస్తున్నాడు. అంతేకాదు వాటిని ఎలా పెంచాలి? మార్కెటింగ్ ఎలా చేయాలో అవగాహన కల్పిస్తున్నారు ఒకవేళ వాటిని అమ్మలేకపోతే వాటిని తనకే తిరిగి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. ఇప్పుడు రెండు కోళ్లు కావాలని దేశంలోని ఎక్కడి నుంచి అడిగినా సరఫరా చేయగల మార్కెటింగ్ నెట్ వర్క్‌ను తయారు చేసుకున్నాడు ప్రదీప్.
వెయ్యి అడుగుల విస్తీర్ణంలో 600 నుంచి 800 కడక్‌నాథ్ కోళ్లను పెంచగలమంటున్నాడు ప్రదీప్. రాత్రిళ్లు కోళ‌్లు షెడ్డులో ఉండేలాగా పగలంతా ప్రీ రేంజ్ లో తిరిగే లాగా చూసుకోవాలని సూచిస్తున్నాడు. దీని వల్ల కోళ్ళకు ఎలాంటి జబ్బులు, తెగుళ‌్లు రావని ఆరోగ్యంగా పెరుగుతాయంటున్నాడు. నాటు కోళ్ళ పెంపకంలో లాభాలు ఆర్జించడం సాధ్యమే కానీ అది అంత సులువుగా రాదని అంటున్నాడు ఈ యువరైతు. అందుకు నిరంతరం పర్యవేక్షణ, ప్రత్యేక శ్రద్ధ అవసరంమంటున్నాడు. కోళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటేనే కాసుల వర్షం కురుస్తుందంటున్నాడు. కోళ్ళకు దాణా అందించే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటున్నాడు ప్రదీప్. పిల్లలు, గుడ్లు పెట్టే బ్రీడర్లు, .గ్రోయర్స్ అంటూ కోళ‌్ళను విభజించి వాటికి అవసరమైన దాణాను అందిస్తున్నాడు. రుచితో పాటు నాణ్యమైన ఆరు రకాల దాణాలను అందిస్తున్నాడు.
కడక్ నాథ్ కోళ్ళతో పాటు వ్యవసాయంలో అంతర పంటలలాగా ఇదే ఫార్మ్ లో తూర్పుజాతి నాటు కోళ్ళు, పందెం కోళ్ళు, గిన్ని , టర్నీ కోళ్లను, బెంగుళూ డక్స్, కుక్కలను పెంచుతున్నాడు. వీటి కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టకుండా ఇక్కడున్న వనరులనే ఉపయోగించుకుంటూ వాటిని పెంచుతున్నారు ఇవి పెంచుకునేందుకు మాత్రమే విక్రయిస్తున్నని అడిగిన వారికి అందిస్తున్నానని ప్రదీప్ చెబుతున్నాడు. భారతదేశంలో ఏ కోనలో ఉన్నా సరే వారికి కావాల్సిన బ్రీడ్ ను పంపే స్థాయిలో తాను ఉన్నానని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పని ఏదైనా సరే అందులో విజయం సాధించాలంటే పట్టుదల, కృషితో తపన కచ్చితంగా ఉండాలి వాటి వల్లే నేడు అనుభవం లేని రంగంలోకి అడుగులు వేసి కూడా అద్భుత విజయాలను సాధిస్తున్నాడు ప్రదీప్. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.