Jasmine Flowers: మల్లెల సాగుకు కేరాఫ్ ‌గా మారిన ఆ గ్రామం

Jasmine Flowers: మండు టెండల నుంచి సేదతీర్చే ఆ పువ్వులని మించిన మనోహర పరిమళం మరెక్కడా ఉండదు.

Update: 2022-05-25 09:58 GMT

Jasmine Flowers: మల్లెల సాగుకు కేరాఫ్ ‌గా మారిన ఆ గ్రామం

Jasmine Flowers: మండు టెండల నుంచి సేదతీర్చే ఆ పువ్వులని మించిన మనోహర పరిమళం మరెక్కడా ఉండదు. వాటిలో సుగంధం అమోఘం, అవంటే మహిళలకు మక్కువ అధికం. మగువ సిగలో ఎన్ని రకాల పువ్వులు ఒదిగినా వాటి ముందు దిగదుడుపే. పరిమళానికి, సోయగానికి స్వచ్ఛమైన ధవళకాంతులకు మారుపేరయిన మల్లె పువ్వుల సాగుకు ఇప్పుడు ఆ గ్రామం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మల్లెల సాగునే జీవనాధారంగా మార్చుకుని ఆ గ్రామం రైతులు యుందుకు సాగుతున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుండి? అంత ప్రత్యేకత సాధించడానికి కారణాలేమిటో తెలుసుకోవాలని ఉందా అయితే ఆలస్యం ఎందుకు కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతానికి వెల్లాల్సిందే మరి.

కనుచూపు మేరలో ఆకుపచ్చని తోటలో తెల తెల్లగా మెరుస్తున్న ఈ తోటలే మల్లె తోటలు. ఒకే ప్రాంతంలో దాదాపు 200 ఎకరాలకు పైగా మల్లెలు సాగవడం విశేషం. ఇంత ఎక్కువ విస్తీర్ణంలో మల్లెలను సాగు చేసే గ్రామాలు కనిపించడం చాలా అరుదు కానీ ఈ ఘనతను దక్కించుకుంది కాకినాడ జిల్లాకు చెందిన సర్పవరం గ్రామం. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వందల కుటుంబాలు మల్లె పూల సాగు మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయి. అయితే ఈ పల్లెకే ఎందుకు అంత ప్రత్యేకత లభించింది.? ఇంకెక్కడా మల్లెలు దొరకవా? అనేకదా మీ సందేహం దీనికి ఓ కారణముంది. ఇక్కడ మల్లెపూలు తుంచే విధానంలోనే అసలు టెక్నిక్ ఉంది. ఇక్కడ పూలు ఏరే సమయంలో పువ్వుకి తొడుగు లేకుండా బొడ్డుతో మాత్రమే తెంపుతారు. ఇలా చేయడం వలన ఎక్కువసేపు తాజాగా ఉంటయంటారు రైతులు.

పుష్ప జాతుల్లో మహారాణిలాంటిది మల్లె. వాస్తవానికి వేసవిలో మండుటెండల మధ్య ఏ పూలైనా క్షణాల్లో వాడిపోతాయి. ఒక్క మల్లెలు మాత్రమే ధవళకాంతులు విరజిమ్ముతూ సుగంధ పరిమళాలను వెదజల్లుతూ వికసిస్తాయి. మొగ్గగా ఉన్నా, పువ్వుగా విచ్చుకున్నా సర్పవరం పూల క్రేజే వేరు. పంట వేసిన 10 నుంచి 15 ఏళ్ల వరకు పూల దిగుబడి అందుతుంది. ఏటా ఫిబ్రవరి మాసం వచ్చిందంటే మల్లె తోటలకు సంబంధించి మల్లె తుప్పలను బాగుచేయడం,వాటికి ఎరువు వేసి నీరు పెట్టడం వంటి పనులు ప్రారంభిస్తారు సాగుదారులు. మార్చి నెలాఖరు నుంచి కొద్దికొద్దిగా పూలు పూయడం ప్రారంభమై ఏప్రిల్‌, మే నెలల్లో అధిక పూల ఉత్పత్తి లభిస్తుంటుంది. అప్పటి నుంచి జూన్‌, జులై వరకు మల్లెల దిగుబడి అందుతుంది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ పూలు విచ్చుకోవడం మల్లెల ప్రత్యేకత. అందుకే వేసవి మల్లెల సీజన్‌.

ఇక్కడి నుంచి మల్లెలు రాష్ట్రం నలుమూలలకు సరఫరా అవుతుంటాయి. మల్లెలు పూసిన ఒక్క రోజులోనే వాడిపోతుంటాయి. అందుకనే వాటిని వడివడిగా కోసి, మాలలుగా మలిచి, అంతేవేగంగా మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. మల్లెల కాలంలో ఇంటి యజమాని ఉదయం,మధ్యాహ్నం పూలు కోసి ఇంటికి తీసుకువస్తాడు, ఇంట్లో మహిళలు వాటిని దండలుగా, పూలజడలుగా కడతారు, ఆ తరువాత వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లి పూలవ్యాపారులకు విక్రయిస్తారు సాగుదారు.

అయితే అంతటి ఘనత గల మల్లెపూల రైతులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం దృష్టి సారించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రపంచంలో దేన్నైనా సృష్టించే శాస్త్రవేత్తలు సైతం మల్లె సహజ గుణాలను కృత్రిమంగా సృష్టించలేకపోయారు. అలాంటి సుగుణాల గల మల్లె మన రాష్ట్ర పుష్పం కావడం తెలుగువాళ్లకు గర్వకారణం.

Full View


Tags:    

Similar News