Natural Farming: బడి పిల్లలకు ప్రకృతి సేద్యపు పాఠాలు భోదిస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతు
Natural Farming: భావితరాలకు బంగారు బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆదర్శ రైతు.
Natural Farming: భావితరాలకు బంగారు బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆదర్శ రైతు. తాను సేంద్రియ సేద్యం చేయడమే కాదు. సేంద్రియ వ్యవసాయం వల్ల మానవాళికి జరిగే మేలను గురించి రేపటి పౌరులకు ఎంతో అర్ధవంతంగా వివరిస్తున్నారు. రసాయనాలతో పొంచి వున్న ముప్పును తెలుపుతూ తక్కువ ఖర్చుతో ప్రకృతి విధానంలో ఆహారాన్ని పండించే విధానాలను బాలలకు పరిచయం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు ఖండాపు ప్రసాదరావు తన వ్యవసాయ క్షేత్రంలో బడికి వెళ్లే చిన్నారులకు సేద్యంలో సేంద్రియ వ్యవసాయం చేసే విధానాలను, సేంద్రియ ఎరువులను వాడే పద్ధతులపై శిక్షణ ఇస్తున్న తీరుపై ప్రత్యేక కథనం.
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాంకు చెందిన ఆదర్శ రైతు ఖండాపు ప్రసాదరావు తన వ్యవసాయ అనుభవాలను బడికి వెళ్లే పిల్లలతో పంచుకుంటున్నారు. నేటి బాలలే రేపటి పౌరులని గుర్తించిన ఈ సాగుదారు వ్యవసాయంపై పిల్లలకు ఇప్పటి నుంచి అవగాహన కల్పించాలన్న కృత నిశ్చయంతో వయస్సు పైబడినా ఎంతో ఓపికతో వారికి సేద్యంపైన శిక్షణను అందిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సేంద్రియ పాగె పాఠాలు నేర్పుతూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఖండాపు ప్రసాదరావు గారు తనకున్న వ్యవసాయక్షేత్రంలో వరి, కూరగాయాలతో సహా ఇతర పంటలను పండిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలను తన క్షేత్రం దగ్గరికి తీసుకువెళ్లి పంటలు ఎలా పండించాలో ఎంతో వివరణాత్మకంగా చెబుతున్నారు. అదే విధంగా సాగులో ఎదురయ్యే ప్రతి సమస్యను వాటిని నివారించే ప్రకృతి సిద్ధమైన విధానాలను తెలుపుతున్నారు. అంతే కాదు తక్కువ ఖర్చుతో, అతి తక్కువ నీటితో పంటలు పండించే పద్ధతులపైన పిల్లలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ బాటిల్స్ తో డ్రిప్పు సిస్టమ్, వాడిపాడేసిన పేపర్ ప్లేట్స్‌తో మల్చింగ్ విధానం ఎలా చేయాలో చక్కకా వివరించారు.
ఇక పంట పొలాల్లో ఎదురయ్యే చీడపురుగులను నివారించేందుకు ఎటువంటి రక్షణ చర్యలుచేపట్టాలి అనేదానిపై పిల్లకు వివరించారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో రసాయనిక ఎరువులే లేకుండా వ్యవసాయం చేయవచ్చునని అన్నారు ఈ రైతు. పిల్లలకు ఈ ఆదర్శ రైతు ప్రకృతి వ్యవసాయం గురించి చక్కగా వివరించారని, ఇది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.