పూల సాగుతో నికర ఆదాయం.. రూ.2 లక్షల వరకు ఆదాయం..
Flower Cultivation: పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ రైతు.
Flower Cultivation: పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ రైతు. స్వయం కృషితో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలో పరిమళాలను వెద జల్లే రంగు రంగుల పూలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా వేసవి సీజన్‌లో మార్కెట్‌లో పూలకు డిమాండ్ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని తనకున్న మూడెకరాల్లో వివిధ పంటల సాగుతో పాటు అరెకరం విస్తీర్ణంలో పూలను మాత్రమే పెంచుతూ మార్కెట్ ను అందుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెంది రైతు బానయ్య. గత 15 ఏళ్లుగా నిర్విరామంగా వివిధ రకాల పూలను పెంచుతున్నారు ఈ సాగుదారు. కోసిన విరులను దాళారుల పాలు చేయకుండా కూతుర్ల సహాయంతో మాలలు కట్టి పొలం వద్దే వినియోగదారులకు విక్రయిస్తూ ప్రతి నెల నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆదాలాబాద్ జిల్లా కు చెందిన రైతు బానయ్యపై ప్రత్యేక కథనం.
ఈ రైతు పేరు బానయ్య. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గోదారిగూడ గ్రామానికి చెందిన రైతు. తనకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆహర పంటలతో పాటు అరెకరం విస్తీర్ణంలో పలు రకాల పూలను సాగు చేస్తున్నారు. ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా గత 15 సంవత్సరాలుగా వేసవి సీజన్‌లో పూల తోటలను సాగు చేస్తూ ఆ పరిమళాలను గ్రామ ప్రజలకు అందిస్తూ , ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
బానయ్య తనకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి , సోయా తో పాటు కూరగాయలు పండిస్తున్నారు. మిగిలిన అరెకరంలో మల్లే, చామంతి, కనకంబరాలు, గులాబి వంటి వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. ఇందులో అత్యధికంగా చామంతి మల్లె పూలు సాగు చెయగా, ఈ పూలతో ఓ చిన్నపాటి కుటిర పరిశ్రమను తన వ్యవసాయ క్షేత్రంలోనే కొనసాగిస్తున్నారు. కోసిన పూలను మార్కెట్‌లకు తీసుకెల్లకుండా, దళారులకు ముట్టచెప్పకుండా పూల జడలుగా, విడి పూలుగా పొలం వద్దే అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అర ఎకరం పూల మొక్కల సాగుకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతోందని అన్ని ఖర్చులు పోను పూల అమ్మకం ద్వారా ఎంత లేదన్నా లక్షన్నర నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు బానయ్య.
ఇక తండ్రికి తగ్గ కూతుళ్లు అని నిరూపించుకుంటున్నారు బానయ్య కూతుర్లు. బానయ్యకు ఐదుగురు ఆడపిల్లలు. అందులో ఇద్దరు ఆడపిల్లలకు పూల తోటల ద్వారా వచ్చిన ఆదాయంతోనే పెళ్లిల్లు చేశారు. మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ప్రస్తుతం చదువుకుంటున్నారు. ఇక వేసవి సెలవులు కావడంతో తన తండ్రికి సేద్యంలో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ఈ అమ్మాయిలు. పొలం పనుల్లో పాలు పంచుకోవడంతో పాటు కోసిన పూలను మాలలుగా, దండలుగా కట్టి విక్రయిస్తున్నారు. ఇలా పూల తోటల సాగులో నాన్నకు సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని బానయ్య కూతుర్లు తెలిపారు. రంగురంగుల పూల మధ్య రోజూ గడుపుతుండటం వల్ల ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. తమ స్వయం కృషితో స్వయం ఉపాధి పొందడంతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తూ పూల తోటల సాగులో రాణిస్తున్న బానయ్య తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.