Papaya Cultivation: పెట్టుబడి 50 వేలు.. ఆదాయం 4 లక్షలు

Papaya Cultivation: బొప్పాయి పంట అనగానే వైరస్ తెగులు గుబులు పుట్టిస్తుంది.

Update: 2021-10-26 09:40 GMT

Papaya Cultivation: పెట్టుబడి 50 వేలు.. ఆదాయం 4 లక్షలు

Papaya Cultivation: బొప్పాయి పంట అనగానే వైరస్ తెగులు గుబులు పుట్టిస్తుంది. వైరస్ ఒక్కసారి పంటలో కనిపించిందంటే ఇక ఆ తోటపై ఆశలు వదులుకోవాల్సిందే అన్న బెంగ రైతులను నిత్యం వెంటాడుతుంది. ఎన్ని వ్యయప్రయాసాలకు ఓర్చినా రైతుల ఈ సమస్య సమసిపోవడం లేదు. అయితే గత కొన్నేళ్లుగా బొప్పాయిలో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌లేడీ 786 రకాన్నే సాగు చేస్తుండటం ఆ రకానికి ప్రత్యామ్నాయ రకాలు అందుబాటులో లేకపోవడం కూడా రైతులకు ఇబ్బందిగా ఉంటోంది. అయితే ఈ క్రమంలో సంగారెడ్డి జహీరాబాద్ మం‌డలం రంజోల్ గ్రామానికి చెందిన యువరైతు రమేష్ రెడ్డి ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నారు. కొత్తరకం బొప్పాయితో తెగుళ్లకు చెక్ పెట్టవచ్చని అనుభవ పూర్వకంగా నిరూపిస్తున్నారు.

గత 30 ఏళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నారు రమేష్, రమేష్‌ తండ్రి అయితే అందులో 28 ఏళ్లు రెడ్‌లేడీ 786 రకాన్నే పండించేవారు. అయితే ఈ రకం బొప్పాయి సాగులో వైరస్ అధికంగా వస్తుండటం సాగు భారంగా మారుతుండటంతో ప్రత్యామ్నాయ రకాలపై దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాల్లో వేరే రకాలు ఉన్నా అవి కూడా వైరస్ బారినపడి రైతుకు నష్టాన్ని మిగుల్చుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని మహారాష్ట్రలో విస్తృతంగా సాగులో ఉన్న నంబర్ 15 బొప్పాయి రకం గురించి తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి సాగును పరిశీలించి నారు మొక్కలను తీసుకువచ్చి రెండేళ్ల క్రితం ప్రయోగత్మకంగా తమ పొలంలో సాగు చేస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు.

నంబర్ 15 బొప్పాయి రకం 98 శాతం వైరస్‌ లను తట్టుకుంటుందని రమేష్ చెబుతున్నారు. మొక్క నాటిన నాటి నుంచి 7 నెలలకే కాయ దిగుబడి అందుతుందని, ఒక్కో చెట్టుకు సుమారు 200 క్వింటాళ్ల వరకు రైతు తీసుకోవచ్చునని తెలిపారు. ఈ రకానికి మార్కెట్‌లో ధర కూడా బాగుందంటున్నారు.

786 రకం మొక్క వేసి ఏడో నెల రాగానే వైరస్‌ వ్యాపిస్తోంది. కాయ కోత సమయంలో ఈ వైరస్ ప్రభాంతో రైతులు పంటను నష‌్టపోతున్నారు. అదే నంబర్ 15 రకం అయితే ఏడో ఏట నుంచి సుమారు చెట్టుకు 200 క్వింటాళ్ల వరకు కాయను అందిస్తోంది. రెండు ఏళ్ల వరకు కాయ దిగుబడి కొనసాగుతుంది. తియ్యటి రుచి, పెద్ద పరిమాణం, కాయ గట్టిదనం కూడా బాగుంటుందని రైతు తెలిపారు. అంతే కాదు ఈ కాయ నిల్వ సామర్థ్యం కూడా అధికమేనంటున్నారు. పూర్తిగా పండిన కాయలు కూడా ఎంతో గట్టిగా ఉంటాయని తద్వారా కొనుగోలుదారులకు, రైతులకు ఎలాంటి నష్టం ఉండదంటున్నారు.

ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో నంబర్ 15 బొప్పాయి రకాన్ని సాగు చేస్తున్నారు ఈ యువరైతు. ఎకరాకు సుమారు 50 వేల వరకు పెట్టుబడి వరకు అవుతుందని తెలిపారు. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతుకు ఎకరాకు ఎంతలేదన్నా 3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం లభిస్తుందంటున్నారు. ఇతర రకాలను సాగు చేసి నష్టాలను చవి చూసే కంటే నూతన రకాలను ఎన్నుకుని రైతు ముందుకు సాగితే తప్పక ఆర్ధికాభివృద్ధి సాధిస్తారని ఈ యువరైతు సూచిస్తున్నారు.

Full View


Tags:    

Similar News