రాష్ట్రంలో మొదటిసారిగా సీడ్ లెస్ పుచ్చ సాగు చేస్తున్న కరీంనగర్ జిల్లా రైతు
Seedless Watermelon: వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్‌లోకి పుచ్చకాయలు వేలాది టన్నులుగా దిగుమతి అవుతాయి.
Seedless Watermelon: వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్‌లోకి పుచ్చకాయలు వేలాది టన్నులుగా దిగుమతి అవుతాయి. చలువ చసే పుచ్చను వేసవిలో తినేందుకు ప్రజలు ఇష్టపడుతుంటారు. కానీ పుచ్చకాయను తినేటప్పుడు దాంట్లో ఉండే గింజలు భలే ఇబ్బంది పెటుతుంటాయి. ఇంత రుచిగా ఉండే ఈ పుచ్చకాయలో గింజలు లేకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటుంటాము. అనుకోవటమేంటి నిజంగానే గింజలు లేని పుచ్చకాయలను ప్రయోగాత్మకంగా పండించేస్తున్నారు ఈ సాగుదారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి గింజలేని పుచ్చను పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు కరీంనగర్ జిల్లా గోపాలపురం గ్రామంకు చెందిన సాగుదారు మందా తిరుపతి . తనకున్న మూడెకరాల పొలంలో మూడు రకాల పుచ్చకాయలు పండిస్తున్న ఈ రైతు, వినూత్నంగా ఈ ఏడు థాయ్‌ల్యాండ్‌కు చెందిన సీడ్‌లెస్ రకాన్ని ప్రత్యేకంగా పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
కొత్త కొత్త పంటలు సాగు చేయాలన్నద ఈ రైతు ఆసక్తి. అందుకు తగ్గట్లుగానే సరికొత్త పంటలు పండించాలనే ఉద్దేశం ఎప్పుడూ రీసర్చ్ చేస్తూ ఉంటారు. రైతు సేద్యంలో ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే కొత్తగా ఆలోచించాలని , కొత్త పంటలు పండించాలంటున్నారు. అలాగే పంట తినేవారికి చక్కటి సౌకర్యంతో పాటు చక్కటి రుచి ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ఎన్నో గింజలు లేని పండ్లను రైతులు పండిస్తున్నారు. అలేగా ప్రజల రుచి, అభిరుచికి తగ్గట్లుగా పంటలు పండిస్తున్నారు ఈసాగుదారు. నాణ్యతతో పాటు రుచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించడంతో పుచ్చ సాగు వైపు ఆసక్తి చూపానని ఈ సాగుదారు తెలిపారు. వరి తో పోల్చుకుంటే ఈ పంట ఎంతో బాగుదంటున్నారు. వరి పైరు 140 రోజులకు కోతకు వస్తే పుచ్చను కేవలం 70 రోజుల్లోనే అమ్మి సొమ్ము చేసుకోవచ్చునని చెబుతున్నారు రైతు తిరుపతి. ఎకరానికి సరిపడే నీటితో మూడు ఎకరాల్లో పుచ్చ సాగు చేసుకోవచ్చంటున్నారు. ప్రస్తుతం తిరుపతి సీడ్‌లెస్, పసుపుపచ్చ, పచ్చ వంటు మూడు రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు. డ్రిప్ , మల్చింగ్ వంటి ఆధునిక విధానాలను అవలంభిస్తున్నారు, సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఎంత లేదన్నా ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి అందుతుందని రైతు అంచనా వేస్తున్నారు.
పుచ్చ సాగు చేయాలనుకునే రైతులు ముందుగా సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు ఈ సాగుదారు. రవాణాలో కాయలు పాడవకుండా ఉండే కీపింగ్ క్వాలిటీ బాగుండే రకాలు ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ పండు తీస్తే కొనుగోలు దారులు పొలానికి వచ్చే పండ్లను తీసుకెళ్తారన్నారు. రైతు మార్కెట్‌పై ఆధారపడకుండ సొంతంగా మార్కెట్ చేసుకోగలిగితే మరింత లాభం పొందవచ్చన్నారు. ఎకరం పుచ్చసాగుకు గాను 50 వేల రూపాయల పెట్టుబడి అయ్యిందని పంట అమ్మకం ద్వారా ఎంతలేదన్నా 60 నుంచి 70 వేల ఆదాయం లభిస్తుందని తెలిపారు.