ఉద్యాన పంటల సాగుతో రైతుకు ఏడాది పొడవునా ఆదాయం

Update: 2019-06-24 10:10 GMT

రైతే ఓ శాస్త్రవేత్త అతని పొలమే ఓ ప్రయోగాల శాల రైతు ఎప్పుడు ఒకే పంటను పండించి చేతులు దులుపుకోవడం కాదు నిరంతరం సాగులో ప్రయోగాలు చేస్తూ ఉండాలి. అప్పుడే రైతు ఆర్ధిక ప్రగతిని సాధించగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎప్పుడూ పండించే వరి ,పత్తి, మిరప, మొక్కజొన్నే కాదు ఉద్యాన పంటల సాగుతోనూ రైతు ఏడాది పొడవునా ఆదాయం పొందవచ్చు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు హరిబాబు తనకున్న 10 ఎకరాల పొలంలో 10 వేల రకాల ఉద్యానవన పంటలను సాగు చేస్తూ లాభాదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ సాగులో విజయపథంలో వె‌ళ్తున్నారు హరిబాబు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం అమీర్ పేట గ్రామానికి చెందిన హరిబాబు 2014 సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నారు. మొదటి ఏడాది రసాయనాల సాగు చేసిన ఈ రైతు దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే ప్రకృతి సాగు విధానాలు, సమగ్ర సేద్య పద్ధతుల గురించి తెలుసుకున్నారు. పక్క రైతు ఏది పండిస్తే అదే పండించాలి అని అనుకునే సాధారణ రైతులా ఆలోచించకుండా ప్రయోగాల సాగు చేపట్టారు హరిబాబు. తనకున్న 10 ఎకరాల్లో ఉద్యానవన పంటలను పండిస్తున్నారు. ఆ వ్యవసాయక్షేత్రంలోనూ జీవవైవిధ్యాన్ని పెంచేందుకు ఓవైపు చేపలను మరోవైపు కోళ్లు,గొర్రెలు, బాతులను పెంచుతున్నారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రకృతి వణక్షేత్రంగా మార్చుకున్నారు.

అరెకరంలో సాగు చేసే వరికి సరిపడే నీటితో పది ఎకరాల్లోని ఉద్యాన పంటలకు నీటిని అందిస్తున్నారు ఈ రైతు. తన పొలంలో ఉన్న బోరులోని రెండించుల నీరే తనకు మంచి దిగుబడిని సాధించిపెడుతోందని చెబుతున్నారు. దీని ద్వారా నికర ఆదాయం లభిస్తుందని సుస్థిరమైన వ్యవసాయం చేయవచ్చునని హరిబాబు అంటున్నారు. రైతులు వరి సాగు చేసి పెట్టుబడులను పెంచుకుని, నీటిని వృధా చేయడం కంటే ఉద్యానవన పంటల సాగువైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. వరి సాగు ద్వారా వచ్చే ఆదాయం రైతుకు సరిపోదని ఏడాదంతా నికర ఆదాయం పొందాలంటే రైతు పండ్ల సాగు చేపట్టాలని చెబుతున్నారు.

గత 4 సంవత్సరాలుగా గోఆధారిత వ్యవసాయం చేస్తున్నారు హరిబాబు. అందుకోసం తన వ్యవసాయ క్షేత్రంలోనే 10 ఆవులను పెంచుతున్నారు. వాటికి అందించే దాణాను కూడా పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలతో స్వయంగా ప్రకృతి ఎరువును తయారు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఆరువేల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకును నిర్మించుకున్నారు. ఇందులో తయారైన జీవామృతాన్ని మోటార్ ద్వారా డ్రిప్ కి పారిస్తూ ఎరువును పంటలకు అందిస్తున్నారు. మంచి నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు. రైతు సోదరులారా సమస్యల సాగుకు ఇకపై సెలవు ప్రకటించి నిత్యం ఆదాయాన్ని అందించే పంటల సాగు వైపు కదాలాల్సిన తరుణమిదే సమగ్ర సేద్యాన్నిచేపట్టి దానికి ప్రకృతి సాగు విధానాలను జోడించి వ్యవసాయం చేస్తే రైతు ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చు.

Full View   

Tags:    

Similar News