డ్రాగన్ సాగులో ప్రయోగాల ఒరవడి.. అధిక దిగుబడిని అందిస్తున్న ట్రెల్లీస్ విధానం..

Dragon Fruit Farming: పల్నాడు జిల్లాకు చెందిన పోలేశ్వరరావు ఓ వ్యాపారి.

Update: 2022-10-10 08:14 GMT

డ్రాగన్ సాగులో ప్రయోగాల ఒరవడి.. అధిక దిగుబడిని అందిస్తున్న ట్రెల్లీస్ విధానం..

Dragon Fruit Farming: పల్నాడు జిల్లాకు చెందిన పోలేశ్వరరావు ఓ వ్యాపారి. కరోనా సమయంలో వ్యాపారాలు నష్టాల బారిన పడటంతో తనకున్న పొలాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకన్నారు. వాణిజ్యపరంగా ఉద్యాన పంటలు వేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే తోటి రైతుల్లా మూస పంటలను పండించడం కాకుండా ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాంలలో లాభాలు ఆర్జించే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. అందులోనూ ఆధునిక విధానాలను అనుసరిస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు ఈ సాగుదారు. హైడెన్సిటీ విధానంలో ఎకరాకు 8 వేల మొక్కలు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తనకున్న 13 ఎకరాల్లో 12 రకాలకు చెందిన లక్ష డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ట్రెల్లీస్ విధానంలో పండిస్తూ అధిక దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు.

డ్రాగన్ ఫ్రూట్‌ కు పెద్దగా చీడపీడలు ఆశించవు. అధిక వర్షాలు కురిసినప్పుడు, వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మాత్రం మొక్కలను చంటి పిల్లల్లా గమనిస్తూ ఉండాలని సాగుదారు సూచిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు, అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు షేడ్ నెట్స్ , స్ప్రింక్లర్స్ వాడకుండా వేసవిలో రెండు నెలల పాటు సున్నాన్ని మొక్కలపై పిచికారీ చేయాలంటున్నారు పోలేశ్వరరావు. తాను సాగు చేస్తున్న 12 రకాల డ్రాగన్ ఫ్రూట్స్‌లలో 10 రకాలు ఎండను తట్టుకునేవి ఉన్నాయని తెలిపారు.

డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ జాతికి చెందిన మొక్కే అయినప్పటికి పసి పిల్లలా కాపాడుకోవాలంటున్నారు సాగుదారు. కమర్షియల్ గా పండిస్తున్నాము కాబట్టి ఎక్కడా చిన్నపొరపాటు కూడా లేకుండా జాగ్రత్తపడాలని చెబుతున్నారు. ట్రెల్లీస్ విధానంలో పండిస్తున్న పంట కావడంతో గాలి వెలుతురు బాగా తగిలి ప్రతి కొమ్మకు కాయ దిగుబడి వస్తోందని రైతు సంతోషం వ్యక్తం చేశారు. అదే రింగు పద్ధతి అయితే బయట ఉన్న కొమ్మలకే కాయలు వస్తాయంటున్నారు. ఇప్పటికైనా రైతులు మూస పద్ధతుల్లో పంటలు పండించడం కాకుండా ఆధునిక విధానాలను అందిపుచ్చుకుని కమర్షియల్‌గా సాగు చేసి లాభాలు పొందాలని తన అనుభవపూర్వకంగా తెలియజేశారు. ఆసక్తి ఉన్న రైతులకు సాగులో సలహాలు, సూచనలు అందిస్తానంటున్నారు.

నూటికి నూరు శాతం సేంద్రియ విధానాలను అనుసరిస్తూ డ్రాగన్ పండ్ల సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. పూనె నుంచి ప్రత్యేకంగా జీవామృతం ప్లాంట్‌ను తీసుకొచ్చారు. ఈ ప్లాంట్‌ ద్వారా ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఉత్పత్తి అయ్యే 8 వేల లీటర్ల జీవామృతాన్ని మోటార్ సహాయంతో డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. అదే విధంగా నవధాన్యాలను నానబెట్టి రుబ్బి వేస్ట్ డీకంపోజర్‌ కలిపి 20 రోజుల తరువాత డ్రిప్ లో పారిస్తున్నారు. నేలలో సత్తువను పెంచేందుకు ప్రతి 6 నెలలకు ఒకసారి బెడ్స్ పైన ఆవు పేడ, జీవన ఎరువులను వేస్తున్నారు. అదే విధంగా నీటి సరఫరా కోసం లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని తన వ్యవసాయ క్షేత్రంలోనే 20 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన పాండ్‌ను నిర్మించుకున్నారు. సమయానుకూలంగా నీటిని అందిస్తున్నారు.

ఒకసారి సాగు చేస్తూ 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. మొదటి ఏడాది పెట్టుబడి పెడితే చాలు 30 ఏళ్లు లాభాలు పొందవచ్చు. మే నుంచి నవంబర్ వరకు పండ్ల దిగుబడితో ఆదాయం ఆర్జిస్తే ఆ తరువాత 6 నెలలు నర్సరీ మొక్కలను తయారు చేసి విక్రయించవచ్చు. డ్రాగన్ తోటలోనూ ప్రయోగాత్మకంగా తేనెటీగలను పెంచుతున్నారు. తద్వారా పరపరాగసంపర్కం జరిగి అధిక దిగుబడి లభిస్తుందంటున్నారు. అంతే కాదు ఉత్పత్తైన తేనెతో అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఇలా 365 రోజులు డ్రాగన్ సాగులో ఆదాయం లభిస్తుందని ప్రపంచంలోనే లాస్ లేని పంట డ్రాగన్ అని పోలేశ్వరరావు చెబుతున్నారు. 

Full View


Tags:    

Similar News