నీరు.. కన్నీరు

Update: 2020-10-06 07:15 GMT

కరువుసీమలో అన్నదాత కష్టాలు మరోసారి వర్ణనాతీతంగా మారాయి. అతివృష్టి అనావృష్టి రైతుల పాలిట శాపంగా మారుతోంది. వర్షాలు ఊరించడంతో అత్యధిక విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగుచేసిన కర్షకులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. చేతికొచ్చిన పంట నోటికందని పరిస్థితి నెలకొంది. అనంత రైతుల దయనీయ పరిస్థితులపై హెచ్ఎమ్‎టీవీ ప్రత్యేక కథనం.

రాయలసీమ జిల్లాల్లో వర్షాధారంతో సాగయ్యే ప్రధాన వాణిజ్య పంట వేరుశనగ ఇప్పుడా రైతన్నలకు కన్నీళ్లను మిగిల్చింది. ఖరీఫ్ ఆరంభం నుంచే ఆశించిన వర్షాలు కురుస్తుండడంతో ఒక్క అనంతపురం జిల్లాలోనే ప్రధాన పంటగా 4.6 లక్షల హెక్టార్లలో వేరుశనగను సాగుచేశారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్రజేసింది. నిరంతరాయంగా కురిసిన వర్షాలకు పంటలు పూర్తీగా దెబ్బతిన్నాయి. తాజాగా పంటల తొలగింపు సమయంలో మరోసారి నిరంతరాయంగా వర్షాలు కురవడంతో పైరు మొత్తం తడిసి కుళ్లిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 15 వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారలు లెక్కలు వేశారు. పంటనష్టంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేసి పూర్తీ స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పొలాల్లోనే పురుగులు వేరుశనగ పంటను తింటున్నాయని ఎకరాకు 25 వేల నుంచి 40 వేల వరకూ పెట్టబడులు పెట్టామంటున్నారు రైతులు. కొన్ని చోట్ల పంట బాగున్నా వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో నిండామునిగామని ప్రభుత్వం ఆదుకొని పెట్టుబడి సాయం చేయాలని కోరుతున్నారు అనంత రైతన్నలు.

వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పంట తొలగించని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 15 రోజులపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు భూమిలోనే పంటకు మొలకలు వస్తున్నాయని తొలగించిన పంట వర్షానికి పనికిరాకుండా పోతోందని వాపోతున్నారు. ఏటా వర్షాభావంతో పంటలు పండక అవస్థలు పడే అనంత రైతులు ఈ ఏడాది అధిక వర్షాలతో పచ్చి కరవును ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అనంతపురంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీలు, రైతుసంఘాల నేతలు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News