ఇంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్న హోం క్రాప్ సంస్థ

Update: 2019-02-02 06:11 GMT

ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే మనం నివసించే వూరు, నగరం రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో పయనిస్తాయి. కాలుష్య రహితంగా, పర్యావరణ హితంగా సమాజాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకు తొలి అడుగు ఇంటి నుంచే మొదలవ్వాలి.

పచ్చని మొక్కల్ని ప్రేమించనివాళ్లు అరుదే. అందుకే ఇల్లు ఎంత ఇరుకైనా ఇంటిముందు కుండీల్లో నాలుగు మొక్కలైనా పెంచుకోవాలి అనుకుంటారు. మేడ మీద కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్నా ఇంటి పంటలను నిర్మించుకోవాలని ఆశపడతారు. దాంతో మార్కెట్లో సులభంగా దొరికే ప్లాస్టిక్‌ కుండీలను కొనుక్కొచ్చి మొక్కల్ని పెట్టేస్తారు. కానీ వీటి బరువు ఎక్కువగా ఉండడం వల్ల, మేడ మీద బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఇంటి పంటలను పెంచుకునే వారి సంఖ్య పెరుగుతుండడంతో వారి ఆసక్తిని గుర్తించిన హోం క్రాప్ సంస్థ ఫ్యాబ్రిక్ గ్రోబ్యాగ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సంచి కుండీలు.

సంచీ కుండీలు మొక్కలకు గాలీ, నీరూ, సూర్యరశ్మిలను చక్కగా ప్రసరింపజేసి మొక్క ఆరోగ్యంగా త్వరగా పెరిగేలా చేస్తాయంటారు అజయ్. ఈ కుండీల్లో మట్టి అవసరం లేకుండా మొక్కలను పెంచవచ్చంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో పాటు పండ్ల మొక్కలను పెంచుకునే విధంగా కుండీలను డిజైన్ చేస్తున్నారు.

వీటిని ఒకచోట నుంచి మరోచొటుకి సులభంగా తరలించవచ్చు. ఈ గ్రోబ్యాగ్స్‌ను జియో టెక్స్‌టైల్ ఫాబ్రిక్‌తో తయారు చేసారు.

మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. నీటి వృథానీ సంచికుండీలు అడ్డుకుంటాయి. నీళ్లు కాస్త ఎక్కువైనా సంచీ పీల్చుకుని మళ్లీ వేళ్లకు అందిస్తుంది. అదీగాక ప్లాస్టిక్‌కుండీలో నీరు ఎక్కువైనా కష్టమే. కొన్ని సందర్భాల్లో బయటకు పోయే మార్గం సరిగ్గా లేకపోతే ఫంగస్‌ల్లాంటివి చేరి, వేరు కుళ్లిపోతుంది. గ్రో బ్యాగ్స్‌లో ఆ సమస్య ఉండదు.

హై ఇంపాక్ట్ పాలిస్టీన్ బెడ్స్‌ను ఇజ్రాయేల్ నుంచి దిగుమతి చేస్తున్నారు అజయ్‌. ఈ బెడ్స్‌ బరువు చాలా తక్కువ. ఈ మడులలో అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలను పెంచుకోవచ్చు. ఇవి 15 ఏళ్ల వరకు మన్నికను ఇస్తాయి. టెర్రస్ మీద తేమ చేరకుండా పీవీసి స్టాండ్ ను బెడ్‌ల కింద అమర్చారు. వర్షం పడినప్పుడు అధిక మొత్తంలో మడుల్లో నీరు చేరినా ఎలాంటి సమస్య ఉండకుండా ఆ వృథా నీరు పోయేందుకు ప్రత్యేకంగా రంద్రాలు ఉన్నాయి. ఈ మడుల్లోనూ కోకోపిట్ నే మీడియంగా వినియోగిస్తున్నారు.

టెర్రస్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవడానికి హోం క్రాప్ సంస్థ సర్వీస్‌ను అందిస్తోంది. అంతేకాదు ఆ తరువాత పెస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేపట్టాలో అనే దానిపైనా ప్రత్యేక సర్వీస్ ను అందిస్తున్నారు అజయ్‌. ఇంట్లో నే సహజ ఎరువులను తయారు చేసుకునే విధంగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. పిల్లల్లో కూడా మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు.

Full View

  

Similar News