మార్కెట్‌లో మీసం మెలేస్తున్న రొయ్య...
Aqua Farmers: నిన్నటి వరకు నీరసపడిన రొయ్య నేడు మీసం మెలేస్తోంది.
Aqua Farmers: నిన్నటి వరకు నీరసపడిన రొయ్య నేడు మీసం మెలేస్తోంది. కరోనా కష్టకాలంలో ఎగుమతులు లేక, ధరలు పడిపోయి వైరస్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులకు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలు ఊరటనిస్తున్నాయి. రెండు నెలల నుంచి రొయ్యల ధరలు పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో కొనుగోలుదారులు పోటీపడుతున్నారు. దీంతో రైతులకు లాభాల పంట పండుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ధరలు లేక పెట్టుబడులు పెరిగి, కరోనాతో ఎగుమతులు లేక కునారిల్లిన ఆక్వా రంగానికి మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయ డిమాండ్ పెరగడంతో వనామీ రొయ్యల ధరలు రెండు నెలలుగా ఆశాజనకంగా ఉంటున్నాయి. ప్రతి నెలా పెరుగుతూ 30 కౌంట్ కు ప్రస్తుతం రూ.550 వద్ద ట్రేడ్ అవుతోంది. అన్ని కౌంట్ల ధరల్లోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఏడాది జులై, ఆగష్టు నెలలతో పోలిస్తే సగటున కిలోకు 130 రూపాయల పెరుగుదల కనిపిస్తోంది. ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. వెరసి సరికొత్త ఉత్సాహంతో పంట సాగుకు సిద్ధం అవుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో 50 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు విస్తరించి ఉన్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులు లేక 30 శాతానికి పైగా రైతులు సాగుకు దూరమయ్యారు. ప్రస్తుతం 25వేల మంది రైతులు మాత్రమే ఈ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్నారు. 11 రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, 13 మంది ప్రధాన కొనుగోలుదారులు ఉన్నారు. జిల్లా నుంచి ఏటా సుమారు లక్షా 20 వేల నుంచి లక్షా 35 వేల మెట్రిక్ టన్నుల వరకు సరకు అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. 2300 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. గత ఏడాది ఆక్వా రైతులు గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నారు. దీంతో దిగుబడి తగ్గింది. ధర పతనమడంతో ఆక్వారంగం నష్టాలమయంగా మారింది. జూన్‌లో వంద కౌంట్ రొయ్యల ధర 160 రూపాయలకు పడిపోయింది. ఇదే సమయంలో నవంబర్, డిసెంబరు నెలల్లో భారీ వర్షాలు కురవడంతో రొయ్యలకు తెగుళ్లు అశించాయి. వెరసి పంట సాగుకు రైతులు దూరమయ్యారు. సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ పరిణామాలతో ఈ పరిణామం మళ్లీ ధరల పెరుగుదలకు దోహద పడుతోంది.
ప్రస్తుతం అమెరికా, యూరప్, చైనా దేశాల నుంచి రొయ్యల ఎగుమతులకు ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రెండు నెలల క్రితం మొదలైన ధరల పెరుగుదల అలాగే కొనసాగుతోంది. గత నెలలో 30 కౌంట్ రొయ్యల ధర 530 నుంచి 540 రూపాయల వరకు ఉండగా, ప్రస్తుతం 550 నుండి 560 వరకు పలుకుతోంది. రైతులు రొయ్యలు విక్రయించిన అనంతరం కొనుగోలుదారులు కొంత సమయం తీసుకుని నగదు చెల్లించేవారు. ప్రస్తుతం డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని సరకును బట్టి వెంటనే చెల్లించడానికి వెనకాడటం లేదు.