గిర్ ఆవు మూత్రంలో కరిగే రూపంలో బంగారం

Gir Cow: భారతదేశానికి రైతు వెన్నుముక అని అంటాం. మరి అలాంటి రైతుకు వెన్నెముక వంటిది దేశీ ఆవు.

Update: 2022-04-08 12:30 GMT

గిర్ ఆవు మూత్రంలో కరిగే రూపంలో బంగారం 

Gir Cow: భారతదేశానికి రైతు వెన్నుముక అని అంటాం. మరి అలాంటి రైతుకు వెన్నెముక వంటిది దేశీ ఆవు. ఒకప్పుడు రైతుకు భూమి లేకపోయినా ఆవులుండేవి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా జీవనాన్ని కొనసాగించేవాడు. ఆవుకు పుట్టిన కోడెలు రైతుల భూములను దున్నేవి. వాటి వ్యర్థాలు పంటలకు ఎరువులుగా ఉపయోగపడేవి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండదండగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ దేశీ ఆవుల జాడే కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యనే కొంత మంది ఔత్సాహిక రైతులు పాడిరంగంవైపు అడుగులు వేసి దేశీయ ఆవుల పెంపకం చేపడుతున్నారు. అందులోనూ గిర్ జాతి ఆవుల పెంపకంతో ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్నారు. మరి ఈ గిర్ జాతి ఆవుల ప్రాముఖ్యత ఏమిటి? వీటి పాలల్లో , మూత్రంలో, పేడలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి? రైతులకు ఏవిధంగా ఉపయోగపడతాయో ఈ ప్రత్యేక కథనంలో చూసేద్దాం.

దేశీ ఆవు పాలకు ఈ మధ్యకాలంలో గిరాకీ పెరుగుతోంది. ఈ పాలను సేంద్రియ పాలుగా, ఏ2 పాలుగా పిలుస్తున్నారు. లీటరు ఎంతలేదన్నా 150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. దేశీ ఆవు పాలతో పాటు దేశీ ఆవు పాల పెరుగు, నెయ్యి, ఆవు మూత్రం, పేడకు ఉన్న ప్రత్యేక ఔషధ గుణాలను గుర్తించిన మన పూర్వీకులు వాటిని అనాదిగా వినియోగిస్తున్నారు. ఈ ఉత్పత్తుల ప్రయోజనాలను ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి. ముఖ్యంగా దేశీ ఆవుల మూత్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోనూ గిర్ జాతి ఆవుల మూత్రంలో లీటరుకు 3 నుంచి 10 మిల్లీ గ్రాముల వరకు బంగారం నీటిలో కరిగే రూపంలో ఉన్నట్లు ఇటీవల గుజరాత్‌లోని జునాఘడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫఎసర్ బీఏ గొలాకియా నేతృత్వంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంగానే అత్యంత ఖరీదైన స్వర్ణభస్మానికి ప్రత్యామ్నాయంగా కూడా గిర్ ఆవుల మూత్రాన్ని కొన్ని ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తున్నారు.

గిర్ జాతి ఆవులు, దూడల మూత్రంలో 5100 ఔషధ ధాతువులను గుర్తించారు. వీటిలో సుమారు 400 ధాతువులను అత్యంత కీలకమైనవిగా పేర్కొంటున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం గిర్ ఆవుల మూత్రంలో ఎక్కువగా ఉన్నట్లు విశ్వసిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం కరోనా ఉపద్రవ కాలంలో లీటరుకు 100 నుంచి 120 వరకు వెచ్చించి శుద్ధిచేసిన గిర్ ఆవు మూత్రాన్ని కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఇదే కాకుండా క్యాన్సర్ నివారణకు, హార్ట్‌పేషెంట్స్‌కు , వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉండేందుకు కూడా గిర్ ఆవుల మూత్రం ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. గిర్ జాతి పశువుల పేడ మూత్రాలను ఎరువుగా వాడితే భూమిలో సారం పెరిగి నాణ్యమైన వ్యవసాయోగ్పత్తులు లభిస్తాయి. ఫలితంగా హానికర రసాయన ఎరువులు , కీటకనాశక రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుంది.

గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతం ఈ ఆవులకు పుట్టినిల్లు. అందుకే ఈ జాతి ఆవులకు గిర్‌ అనే పేరు వచ్చింది. అక్కడ జనాఘడ్, ఖతియవార్, భావనగర్, రాజ్‌కోట్, అమ్రేలీ జిల్లాల్లో స్వచ్ఛమైన గిర్ జాతి ఆవులు, ఆంబోతులు లభిస్తాయి. గిర్ జాతి పశువుల విలువను గుర్తించిన అమెరికా, బ్రెజిల్, వెనిజులా వంటి దేశాలు గిర్ ఆంబోతులను దిగుమతి చేసుకుని అక్కడ పశుసంపదను అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే దక్షిణ భారత్‌లోనూ గిర్ ఆవుల పెంపకాన్ని డెయిరీల నిర్వాహకులు చేపడుతూ ప్రయోజనం పొందుతున్నారు.

భారత్‌లో ఉండే గిర్ ఎద్దులు 400 కిలోల వరకు శరీర బరువు కలిగి ఉంటాయి. నలుపు, తెలుపుతో పాటు ఆకర్షణీయమైన బంగారు వర్ణంలో వదులైన మెరిసే మృదువైన ఛర్మం కలిగి ఉంటాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. పటిష్టమైన గిట్టలు, కాళ్లవల్ల ఇవి సేద్య పనికి కూడా అనువైనవి. ఈ జాతి ఎద్దులు, ఆవులు సాధు స్వభావంతో యజమానులతో స్నేహంగా మెలుగుతాయి. ముఖ్యంగా ఉబ్బెత్తుగా విశాలంగా ఉండే నుదురు వల్ల వీటి మెదడులోని పిట్యుటరీ గ్రంథి చురుకుగా ఉండి పాల ఉత్పత్తిని, అధిక పురనరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం. వేలాడే పెద్ద చెవులు, పటిష్టంగా ఉండి, వెనుకకు తిరిగి పైకి చూసే కొమ్ములు, పొడవైన తోక, చురుకుగా జలదరించే చర్మం ఈ పశువుల లక్షణాల్లో ముఖ్యమైనవి.

గిర్ ఆవుల పొదుగు గుండ్రంగా , బాగా అభివృద్ధి చెంది పొడవైన రొమ్ములతో యంత్రాలతోనూ పాలు పితికేందుకు అనుకూలంగా ఉంటాయి. గిర్ ఆవు పెయ్యలు 20 నుంచ 24 నెలల్లో యుక్త వయస్సుకు వచ్చి సుమారు 280 నుంచి 285 రోజులు చూడితో ఉంటాయి. ఈనిన 3 నుంచి 4 నెలల్లో మళ్లీ గర్భాధారణ చేయగలవు. 12 నుంచి 15 సంవ్సరాల జీవితకాలంలో ఇవిసుమారు 9 నుంచి 10 దూడల వరకు జన్మనిస్తాయి. ఈతలో 300 రోజుల్లో సగటున 1500 నుంచి 2000 లీటర్ల పాల ఉత్పత్తి ఉంటుంది. పాలలో నాలుగున్నర నుంచి 5 శాతం అత్యంత నాణ్యమైన వెన్న లభిస్తుంది. సగటు దినసరి పాల ఉత్పత్తి 10 నుంచి 15 లీటర్ల వరకు ఉంటుంది. గిర్ జాతి ఆవుల వరీర పరిమాణం తక్కువగా ఉండటం, ఆవుల్లో విశాలమైన గర్భా్ద్వారం వంటి కారణాల వల్ల ఈత సమయంలో సమస్యలు తక్కువగా ఉంటాయి.

గిర్ ఆవుల మూత్రాన్ని వినియోగించి గుజరాత్‌లోని కొందరు వైద్య ప్రముఖులు కేన్సర్ నివారణలో సైతం విజయం సాధిస్తున్నారు. అయితే ఇది ప్రయోగ అధ్యయన దశల్లోనే ఉంది. మేలుజాతి గిర్ ఆంబోదుల వీర్యాన్ని, అత్యున్నత స్థాయి గిర్ పిండాలను గిర్ గోశాలలకు , డెయిరీ ఫారాలకు, పాడి కమతాలకు అందించి వేగంగా మేలైన గిర్ పశు సంపదను విస్తరిస్తే మన పాడి రైతులకు , పాల వినియోగదారులకే కాకుండా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

Full View


Tags:    

Similar News