Natural Farming: దేశీయ సిరులు.. 5 ఎకరాల్లో..14 రకాలు

Natural Farming: పొరుగు రైతులు హేళన చేశారు. మీవల్ల కాదంటూ పెదవి విరిశారు.

Update: 2021-11-12 07:07 GMT

Natural Farming: దేశీయ సిరులు.. 5 ఎకరాల్లో..14 రకాలు

Natural Farming: పొరుగు రైతులు హేళన చేశారు. మీవల్ల కాదంటూ పెదవి విరిశారు. అధిక దిగుబడులు సాధించే అవకాశమే లేదని వాదించారు. అయినా పట్టుదల వదల్లేదు ఆ మాటలే వారిలో మరింత మనోధైర్యాన్ని నింపాయి సాగులో కొత్త దారులు వెతికేలాచేశాయి. పొలాలనే ప్రయోగశాలలుగా మార్చి మూసదోరణులకు వెళ్లకుండా తోటి రైతులకు భిన్నంగా దేశీయ వరి రకాలను సాగు చేశారు. ప్రకృతి సాగు పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని ఓ కుంటుంబ సభ్యులు. సేద్యంలో సాధ్యం కానిది ఏదీ లేదని ప్రత్యక్షంగా నిరుపిస్తున్నారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన నారాయణ, సుగుణ దంపతులు వారి కున్న ఐదు ఎకరాల్లో మొదట అందరిలాగే వ్యవసాయం చేసేవారు. పెట్టుబడి పెరుగుతున్నా దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉండటంతో దేశవాళీ వరి వంగడాల సాగువైపు దృష్టిసారించారు. గత యాసంగిలోనే వీటిని సాగు చేయడంతో దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. దీంతో ఈసారి 14 రకాల వరి వంగడాలను సాగు చేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

నారాయణ, సుగుణల పెద్ద కుమారుడు బాగా చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచీ తల్లితండ్రులు పడే కష్టాన్ని చూసిన ఆ యువకుడు సాగులో కొత్తదారులు వెతికాడు. ప్రకృతి పద్ధతుల్లో నల్ల, ఎర్ర వరి రకాల సాగుపై అధ్యయనం చేశాడు. ఆ వివరాలు చెప్పి, సేద్యంలో మార్పు చేయమంటూ అమ్మానాన్నలకు హితవు పలికాడు. కుమారుడు చెప్పిన పంథాను వారు ప్రయోగాత్మకంగా అనుసరించారు. ఫలితం బాగుంది. మరింత విస్తరించారు. నవ్విన నాపచేనే పండింది. సాగు లాభాలు చూపింది. పలువురికి ఆదర్శంగా నిలిపింది

నల్లవరిలోని నాలుగు రకాలు, నవారా, మ్యాజిక్ రైస్, నారాయణ కామిని , రత్నచోడి, పసిడి, సిరిసన్నాలు వంటి 14 రకాల దీశీయ వరి వంగడాలను పండిస్తున్నారు. పూర్తి ప్రకృతి విధానాలనే పాటిస్తుండటంతో పంటకు ఇప్పటి వరకు చీడపీడలు ఆశించలేదని చెబుతున్నారు ఈ కుటుంబసభ్యలు. ఒకవేళ వచ్చిన వాటిని తట్టుకునే శక్తి దేశీయ వంగడాలకు ఉందని చెబుతున్నారు. దేశీయ వంగడాల్లో పోషకాలు, ఔషధ గుణాలు ఉండటం వల్ల వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నామన్న సంతృప్తి కలుగుతోందని నారాయణ, సుగుణల చిన్న కుమారుడు పవన్ చెబుతున్నాడు.

పంట నుంచి మంచి దిగుబడి అందుతోందని చెబుతున్న వీరు పొలంలోనే మినీ రైస్‌ మిల్లను ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని బియ్యంగా మార్చి వినియోగదారులకు అందిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు. తోటి రైతులు దేశీయ వంగడాల సాగు చేపట్టి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పొందాలను ఈ కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు. ఈ రైతు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు ప్రకృతి విధానంలో వరి సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

అంతరించిపోయే దశకు చేరుకున్న ఆరోగ్య విలువలు కలిగిన దేశవాళీ వంగడాలను పండిస్తూ అదర్శంగా నిలుస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు. రసాయన ఎరువులు పక్కన పెట్టి ప్రకృతి విధానాలను చేపట్టి గ్రామంలో సాగులో కొత్త ఒరవడిని కొనసాగిస్తున్నారు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Full View


Tags:    

Similar News