భారతీయ వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో రైతు ముందున్న ప్రత్యామ్నాయ పరిష్కారమార్గం ప్రకృతి వ్యవసాయం. ఇందులోనూ కొన్ని సాదకబాధలు ఉన్నాయి. ప్రకృతి సాగు పద్ధతులను అనుసరించే రైతులు ప్రకృతి ఎరువులను తయారు చేసుకుంటున్నారు సరే కానీ వాటిని సరైన క్రమంలో మొక్కలకు అందించడం లేదు దీని ప్రభావం దిగుబడిపై పడుతోంది. దీంతో రైతు కష్టానికి ఖరీదు దక్కడం లేదు ఈ నేపథ్యంలో ప్రకృతి విధానంలో తయారైన ద్రవరూప ఎరువులను పంటలకు అందించేందుకు ద్రావణ ఎరువుల సరఫరా విధానాన్ని యాదాద్రి జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాల్‌రెడ్డి రూపొందించారు. ఈ విధానంపైనే ప్రత్యేక కథనం.
రైతులు స్థానికంగా లభించే వనరులతో ప్రకృతి ఎరువులను తయారు చేసుకోవడం ఒక ఎత్తైతే వాటిని సరైన సమయంలో పంటలకు అందించడం మరో ఎత్తు. తన శ్రమనే పెట్టుబడిగా పెట్టిన రైతు ఒక్కోసారి అనుకున్న దిగుబడులు సాధించక అసంతృప్తికి గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాల్‌రెడ్డి రైత ప్రయోజనాల దృష్యా నూతన విధానాన్ని రూపొందించారు. అదే ద్రావణ ఎరువుల సరఫరా విధానం.
అనుకున్న దిగుబడి రైతు సొంతం చేసుకోవాలంటే పంటలకు సకాలంలో పోషకాలను అందించాలి. పోషకాల చక్రం దెబ్బతినకుండా రైతు జాగ్రత్తపడాలి. ద్రవరూప ఎరువులను ప్రతీ మొక్కకు అందించడం శ్రమతో కూడుకున్న పని అంతే కాదు కూలీల కొరత ప్రస్తుతం రైతుకు పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతు బాల్‌రెడ్డి రూపొందించన విధానంతో తక్కువ శ్రమతో వీలైనంత ఎక్కువ పరిమాణంలో ఎరువులను అందించవచ్చు. ఇదే విధానాన్ని గత మూడు సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో ప్రయోగిస్తూ విజయవంతంగా పంటల సాగు చేస్తున్నారు ఈ రైతు వేల లీటర్ల ద్రావణాన్ని కూడా పంటలకు ఒకేసారి అందిస్తున్నారు.
25 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల లోతుతో దాదాపు 90 వేల లీటర్ల సామర్థ్యంతో జీవన ఎరువుల ట్యాంకు ను నిర్మించుకున్నారు. 20 ఎకరాలకు జీవన ఎరువులను అందించే సామర్థ్యం ఈ ట్యాంకుకు ఉంది. వ్యక్తిగత శ్రమ అవసరం లేదు డబ్బులు ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేయాల్సిన అవసరం రాదు. ఫాం పాండ్ మోటార్ ఆధారంగా ఈ విధానంలో ఎరువులను సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను అంతే తేలికగా రైతు పరిష్కరించే విధంగా నూతల పద్ధతులను పాటిస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు.