Dragon Fruit Farming: ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు దంపతులు
Dragon Fruit Farming: మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు కొత్త పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు సాగుదారులు.
Dragon Fruit Farming: మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు కొత్త పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు సాగుదారులు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సాగు వివరాలు తెలుసుకుని ప్రయోగాత్మక పంటలను సాగు చేస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు దంపతులు. డ్రాగన్ ఫ్రూట్ ను ప్రధాన పంటగా పండిస్తూ అందులో అంతర పంటలుగా జామ, మొక్కజొన్న, మిరప, వేరుశనగ సాగు చేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ సేద్యంలో సత్ఫలితాలు సాధిస్తున్న సుమలత, రమేష్ దంపతులపై ప్రత్యేక కథనం.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని బద్ధిపల్లికి చెందిన ముడిమరుగుల సుమలత, రమేశ్ దంపతులు ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. వరి, పత్తి వంటి సాంప్రదాయ పంటల సాగులో లాభాలు అంతంత మాత్రంగానే ఉండటంతో కొత్త పంటలు పండించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త పంటల సాగుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. అందులో డ్రాగన్ ఫ్రూట్ పంట ఈ రైతు దంపతులను ఆకర్షించింది.
ఒకసారి వేసుకుంటే 20 ఏళ్ల వరకు దిగుబడి వస్తుండటం అంతర పంటలను సాగు చేసే అవకాశం ఉండటంతో ప్రయోగాత్మకంగా 2020 సంవత్సరంలో పంట సాగు ప్రారంభించారు. 50 సెంట్లలో 27 పోల్స్ ను ఏర్పాటు చేసుకుని కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి నారు మొక్కలను తెప్పించి నాటుకున్నారు. ప్రస్తుతం కాయ దిగుబడిని చూస్తూ రైతుదంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాగు ఆశాజనకంగా ఉండటంతో మరో ఎకరం విస్తీర్ణంలో 450 పోల్స్ ను ఏర్పాటు చేసుకుని ఒక్కో పోల్‌కు నాలుగేసి మొక్కలను నాటి పంట సాగు చేస్తున్నారు. డ్రాగన్ లో అంతర పంటలుగా జామ, మొక్కజొన్న, మిరప, వేరుశనగ సాగు చేస్తున్నారు. ఇవి కూడా మంచి దిగుబడిని అందిస్తున్నాయంటున్నారు. అయితే పంట సాగుకు నీటి కొరత వేధిస్తోందని అధికారులు స్పందించి డ్రిప్ సౌకర్యాన్ని కల్పిస్తే సాగులో మరింత మెరుగైన దిగుబడులు పొంది లాభపడతామని చెబుతున్నారు ఈ సాగుదారులు.