Dragon Fruit: మిద్దె సాగుకు అనుకూలమని నిరూపణ

Dragon Fruit: భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసిన డా.ఎం.పద్మయ్య గారు వృత్తిపరంగానే రిటైర్ అయ్యారు.

Update: 2021-08-09 09:49 GMT

Dragon Fruit: మిద్దె సాగుకు అనుకూలమని నిరూపణ

Dragon Fruit: భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసిన డా.ఎం.పద్మయ్య గారు వృత్తిపరంగానే రిటైర్ అయ్యారు. విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా రైతులకు సేవలను అందిస్తూ సేద్యంలో వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్నారు. గతంలో పండ్ల తోటల మీద పనిచేసిన అనుభవం ఉన్న పద్మయ్య గారు ఇప్పటికీ వివిధ పంటలపై పరిశోధనలు చేస్తూ మేలైన పద్ధతులను రైతుకు పరిచయం చేస్తున్నారు. అందుకోసం తన ఇంటి మేడనే ఓ ప్రయోగశాలగా మార్చారు ఈయన. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగవుతున్న డ్రాగన్‌ పండ్ల తోటను తన మేడ మీద విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నారు. వియత్నాం, వైట్, వియత్నాం రెడ్ తో పాటు హైబ్రిడ్, తెలుపు రకాల పండ్ల మొక్కలను సేకరించి మిద్దెపైన పెంచుతున్నారు. గత ఐదేళ్లుగా డ్రాగన్ ఫ్రూట్‌ సాగును పరిశీలిస్తున్న ఈ రిటైర్డ్‌ శాస్త్రవేత్త రైతులకు తెలియని ఎన్నో కొత్త విషయాలను పంచుకున్నారు.

దక్షిణ అమెరికా ప్రాంతంలో సాగయ్యే డ్రాగన్ ఫ్రూట్ ఇందులో పోషక విలువల కారణంగా అన్ని దేశాలకు పాకింది. ఒక్కసారి పెట్టుబడి ఖర్చు భరిస్తే 16 నెలల నుంచే దిగుబడి మొదలవుతుందని మూడో ఏట నుంచి రెండు నుంచి 3 టన్నుల వరకు దిగుబడి చేతికివచ్చే అవకాశం ఉందని డా.ఎం.పద్మయ్య తెలిపారు. మార్కెట్ లో ఈ పండుకు డిమాండ్ ఉన్నా రైతులు సంఘాలుగా ఏర్పడి సాగు చేస్తే మార్కెట్ సమస్యలను ఎదుర్కొనవచ్చని సూచిస్తున్నారు. కేవలం పండ్లు మాత్రమే కాకుండా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ సాగు లాభదాయకమని అంటున్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని డ్రాగన్ మీద పూర్తి పరిశోధనలు చేసి రైతులకు సహకరించాలని కోరుతున్నారు.

కేవలం నేల మీదే కాదు డ్రాగన్ ఫ్రూట్ మిద్దె తోటల సాగుకు అనుకూలంగా ఉంటుందని నిరూపిస్తున్నారు ఈ రిటైర్డ్ శాస్త్రవేత్త . సరైన పద్ధతులు పాటిస్తే నేల మీద పండిస్తే ఏ విధంగా పండ్లు వస్తాయో అదే విధంగా మిద్దెలోనూ పొందవచ్చంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఒక ఎడారి మొక్కని దీనికి ఎలాంటి చీడపీడలు రావని చాలామంది రైతుల్లో అపోహ ఉంది. కానీ అన్ని మొక్కల లాగే ఇందులోనూ చీడపీడలు అధికమేనని అంటున్నారు ఈ రిటైర్డ్ శాస్త్రవేత్త. తేనెబంక, పిండినల్లి, పొగాకు లద్దెపురుగు, నులిపురుగు, వైర్ వార్మ్స్ ఇలా అనేకమైన చీడలు పంటను ఆశిస్తాయని చెబుతున్నారు. సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకునే వారు 5 ఎంఎల్ నీమ్‌ ఆయిల్ ను నీటిలో కలిపి పిచికారీ చేస్తే చీడలను నియంత్రించవచ్చంటున్నారు.

ఈ పంటకు ప్రధానమైన శత్రువులు చీమలు. ఇవి లేత చిగుర్లను రంద్రాలను చేసి అందులో ఉండే గుజ్జును తింటాయి. దాని వల్ల ఫంగస్ కూడా అటాక్ అవుతుంది. చీమల దండు పువ్వుదశలో ఉన్న కాయ దగ్గర గూడు కట్టుకుని గుడ్లు కూడా పెడతాయి. వీటిని రైతులు, మిద్దె సాగుదారులు గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 160 రకాలకుపైగా డ్రాగన్ పండ్లు ఉన్నాయి. అందులో కొన్ని పండ్లు అవుతాయి మరికొన్ని పువ్వులుగానే ఉంటాయి. అయితే విదేశీ పండును ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నప్పటికీ ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునేవి చాలా తక్కువ రకాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల పండ్ల మొక్కలను క్రాస్ చేసి అది ఈ ప్రాంతాలను అనుకూలంగా ఉంటాయో లేదో తెలుసుకుని రైతులకు పరిచయం చేయాలనే ఆలోచనో ఉన్నారు పద్మయ్య గారు. ముఖ్యంగా ఎండను తట్టుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచడం. పండ్ల యొక్క కాల పరిమితిని తగ్గించడం అనేవాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎన్నో పరిశోధనలు చేస్తూ రైతులను, మిద్దె సాగుదారులను ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నం చేస్తున్న డా.ఎం.పద్మయ్య గారు అందరికీ స్ఫూర్తి నిలుస్తున్నారు.

Full View


Tags:    

Similar News