Cyclone Tauktae: అకాల వర్షాలతో అన్నదాత కన్నీళ్లు
Cyclone Tauktae: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి.
Cyclone Tauktae: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా భారీ మొత్తంలో పంట నీటిపాలైంది. దీంతో పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను నిల్వ చేయడానికి సరైన స్థలం లేకపోవడంతో పంట చేలల్లోనే ఉంచారు. అయితే తౌక్టే తుపాను ప్రభావంతో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల్లో పంట తడిసి ముద్దయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పొలం సాగుకంటే పండించిన పంటను అమ్ముకోవడానికే ఎక్కువ యాతన పడాల్సి వస్తోంది. మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వం రైతులకు శాపంగా మారింది. ధాన్యం తరలించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. లారీలు రాకపోవడంతో, తూకం వేసిన బస్తాలు కేంద్రాల్లోనే నిల్వ ఉంటున్నాయి. దీంతో వాటిని తరలించే వరకు అన్నదాత పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి, తమ పంటలను వెంటనే కొనుగోలు చేయాలని ప్రాధేయ పడుతున్నారు అన్నదాతలు.