మాంసాహారుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ నాటు కోళ్లకు మార్కెట్‌లో గిరాకీ పెరుగుతోంది. అయితే, షెడ్లలో కోళ్లను ఉంచి పెంచే పద్ధతిలో ఖర్చులు అధికమైన నేపథ్యంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే, విద్యావంతులైన చంద్రశేఖర్, సుజాత దంపతులు ఉద్యోగాలకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. సేంద్రియ విధానంలో స్వల్ప ఖర్చుతోనే నాటుకోడి గుడ్ల ఉత్పత్తిని చేపడుతున్నారు. లాభాలబాటలో పయనిస్తున్నారు. నాటు కోడి గుడ్ల ఉత్పత్తితో లాభాలబాటలో పయనిస్తున్న వనపర్తి జిల్లా దంపతులప నేలతల్లి ప్రత్యేక కథనం.
ఈ ప్రపంచంలో మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా అంటే అది గుడ్డు మాత్రమే. పట్టుమని 50 గ్రాములు కూడా ఉండని ఒక్క చిన్న గుడ్డులో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే ప్రపంచం యావత్తూ గుడ్డును అమింతంగా ఆస్వాదిస్తోంది. అందులోనూ నాటు కోడి గుడ్డు రుచే వేరు కానీ నాటు కోడి గుడ్లు చాలా అరుదు ఎక్కడో చోట అమ్మినా వాటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. అయనా నాటుకోడి గుడ్డ కోసం పరుగులు తీస్తుంటారు గుడ్డు ప్రియులు ఈ డిమాండ్‌ను గుర్తించే వరపర్తి జిల్లాకు చెందిన దంపతులు నాటు కోడి గుడ్ల ఉత్పత్తిని చేపట్టారు విజయపథంలో ముందుకెళుతున్నారు.
వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. వనపర్తి జిల్లా జగత్ పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఆయన భార్య సుజాత ఫార్మసీ చదివారు. అయినప్పటికీ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఎకరం విస్తీర్ణంలో 5 వేల కోళ్ల కెపాసిటీ కలిగిన షెడ్డును నిర్మించి ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటు కోళ్లను పెంచుతున్నారు.
నాటు కోళ్లను అందరూ పెంచుతున్నారు. అందుకే నాటు కోళ్ళ మాంసాన్ని కాకుండా గుడ్లను ఉత్పత్తి చేయాలన్న ఆలోచన వచ్చింది అందరికి పౌష్టికాహారాన్నిచ్చే కోళ్ళ గుడ్లను అందిస్తున్నారు. ఒక రోజు వయస్సు వున్న మూడు వేల కోడి పిల్లను 5 నెలల క్రితం తీసుకువచ్చి పెంపకాన్ని చేపట్టాడు ప్రస్తుతం ఆ కోళ్లు గుడ్ల ఉత్పత్తిని అందిస్తున్నాయి. 3 వేల కోళ్ళకు గాను 1500 కోడి గుడ్ల ఉత్పత్తి లభిస్తోంది. మరో 1000 కోడి గుడ్ల ఉత్పత్తి తరువాత దశలో వచ్చే అవకాశం వుందని చంద్రశేఖర్ చెబుతున్నారు.
చాలామంది రుచిగా ఉండే ఆహారంలో పోషకాలుండవనీ, పోషకాలుండే ఆహారానికి రుచీపచీ ఉండవని భావిస్తుంటారు. కానీ రుచినీ, ఆరోగ్యాన్నీ రెంటినీ రంగరించి మనకందించే సహజ ఆహారం గుడ్డు. అందులోనూ నాటు కోడి గుడ్డు రుచే వేరు అందుకే ఎలాంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియ విధానంలో గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. సమాజానికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు ఈ రైతు.
ఇప్పుడు అందరూ సేంద్రియ ఉత్పత్తులపై దృష్టి పెడుతున్నారు. అందుకే పంటల సాగులోనే కాదు వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ సేంద్రియ పధ్దతులను రైతులు అనుసరిస్తున్నారు. అదే రీతిలో ఇప్పుడు పౌల్ట్రీ లో సేంద్రియ గుడ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని పూర్తి సేంద్రియ విధానంలో నాటు కోడి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు చంద్రశేఖర్ దంపతులు.
బాయిలర్ గుడ్లు ప్రమాదకర రసాయనాల మిశ్రమం అయిపోయాయి. ఇందుకు కారణం వాటికి వేసే దాణా మొత్తం రసాయనాలతో కూడినది కావడమే. ఇలాంటి గుడ్లు తింటే ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కోళ్లకు పూర్తి ఆరోగ్యకరమైన, ప్రకృతి విధానంలో పండిన దాణాను అందిస్తున్నాడు చంద్రశేఖర్. మొక్కజోన్న, రాగుల దాణాతో పాటు తాము అదనంగా ఆకుకూరలను కోళ్లకు అందిస్తున్నామని అంటున్నారు ఈ రైతు. అందులో అదనంగా పుంటి కూర, పిల్లి పెసర, తోట కూర తో పాటు నీలం మరింత బలంగా వుండేందుకు బంతి పూల ఆకులను కూడ కోళ్లకు అందిస్తున్నారు.
నాటు కోళ్ల కోసం ప్రత్యేకంగా తానే ఆకుకూరలను సాగు చేస్తున్నాడు. ఎకరం స్థలంలో 5 వేల కోళ్ల షెడ్ తో పాటు వాటికి కావలసిన ఆకుకూరలను పెంచుకోవటానికి అవకాశం వుంటుందని చెబుతున్నారు. ప్రకృతి సహజమైన పదార్థాలను తిని కోళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి. అవి పెట్టే గుడ్లల్లో పోషకవిలువలు కూడా సమృద్ధిగా ఉంటున్నాయి.
నాటు కోళ్లు పెంపకం ఎంతో సులువు అయినా జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నాడు ఈ రైతు. చిన్నప్పటి నుంచి వాటకి సమయానికి దాణా అందిచాలంటున్నారు. షెడ్డులోనూ సీజన్‌ల వారీగా జాగ్రత్తలను తప్పనిసరి తీసుకోవాలని చెబుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో కోళ్లను పెంచాలని సూచిస్తున్నారు. నాటుకోళ్ళలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వీటికి పెద్దగా రోగాలు ఏమీ రావు కాబట్టి వీటికి బ్రాయిలర్ కోళ్ళలాగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు గుడ్డు పై పొట్టు కూడా గట్టిగా వుండటం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కేవలం ఆరోగ్యకరమైన వాతావరణంలో వీటిని పెంచగలిగితే చాలు రైతుకు మంచి ఉత్పత్తిని అందిస్తుంది.
రోజూ ఉదయం లేవగానే వాటర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఉదయం సాయంత్రం వేళలో పోషకవిలువలతో కూడిన దాణాను అందించాలి.
ఇలా చేయడం వల్ల కోళ్లు ఆరోగ్యకరంగా పెరుగుతాయంటున్నారు రైతు. గుడ్లు పెట్టేందుకు కోళ్లు చీకటి ప్రదేశాన్ని చూసుకుంటాయ్ ఇందు కోసం టైర్లను ఒక దాని పైన ఒకటి పేర్చి తయారు చేసిన వాటిలోకి వాటంతటం అవే వెళ్లి గుడ్లు పెడతాయి ఈ రబ్బర్ తో కూడిన టైర్ వల్ల గుడ్లు సేఫ్‌గా ఉంటాయంటున్నాడు రైతు. వర్షకాలం , చలికాలంలో సమస్యలు తక్కువగా వున్నప్పటికి, ఎండా కాలంలో మాత్రం వేడి తాకకుండా చాలా జాగ్రత్తగా కోళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వేడి నుంచి కోళ్ళను కాపాడేందుకు ఫాగర్ లను అమర్చి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఒక్కో కోడి 8 నుండి 10 నెలల వరకు గుడ్లు పెడతాయి ఒక్క కోడిపై 300 గుడ్ల ఉత్పత్తి లభిస్తుంది. అంటే ఒక్కకోడితో 24 వేల రూపాయల ఆదాయం పొందుతున్నాడు చంద్రశేఖర్. రోజుకు 9 వేల రూపాయల ఆదాయం వస్తోంది. వృత్తి రీత్యా తన భర్త ఆర్ఎంపీ డాక్టర్ కావటంతో భార్య భర్తలు ఇద్దరు కలసి ఈ నాటు కోళ్ళను పెంచుతున్నామని మహిళ రైతు సుజాత అంటోంది. ప్రస్తుతం యువతకు ఇదొక మంచి ఉపాధి అవకాశమని దీనికి ప్రభుత్వం కూడ సబ్సిడీని ఇస్తుందని చెబుతున్నారు.
ఏ పని చేసినా అందులో పూర్తి నిబద్దతను చూపించాలి అప్పుడే సత్ఫలితాలు మీ సొంతమవుతాయి. అదే చేసిచూపిస్తున్నారు ఈ రైతు దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయానికి భారీగా ఖర్చు పెట్టాలి. కలిసి రాకపోతే అప్పులు మిగులుతున్నాయి. పెద్దగా పెట్టుబడులు లేని, ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ ఉండే వ్యాపారం చేయాలనుకునే వారు నాటుకోళ్ల పెంపకాన్ని మొదలు పెట్టాలంటున్నారు చంద్రశేఖర్. నిరుధ్యోగులకు మంచి ఉపాధి మార్గమని సూచిస్తున్నారు.