సీతాఫలం రైతులకు కరోనా దెబ్బతో కష్టకాలం !

Update: 2020-09-05 04:39 GMT

సీజనల్ ఫ్రూట్స్ లో మనకు ముందుగా గుర్తొచ్చే ఫలం సీతాఫలం వర్షాకాలం వచ్చిందంటే ఈ ఫలం కోసం ఎంతలా ఎదురుచూస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సీతాఫలాలు పండించే రైతులపైనా కరోనా మహమ్మారి ప్రభావం పడింది. దిగుబడి తక్కువున్నా, దళారుల మోసాలకు గిరిజనులు నష్టాలను చవిచూస్తున్నారు.

వర్షాకాలం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది సీతాఫలమే అయితే కరోనా మహమ్మారి ఈ ఫలాలను పండించిన రైతన్నలనూ కోలకుకోలేని దెబ్బతీసింది. ఇతర రాష్ట్రాల వ్యాపారులు మన్యానికి రాకపోవడం జిల్లాలోని వర్తకులు కుమ్మక్కై తక్కువ ధరకు సీతాఫలాలను కొనుగోలు చేస్తుండడంతో గిరిజనులు లబోదిబోమంటున్నారు. మైళ్ళ దూరం కొండలు, గుట్టలు దాటుకుంటూ కాలి నడకన వస్తున్నా ఫలితం మాత్రం దక్కడంలేదంటూ వాపోతున్నారు.

ముఖ్యంగా రాష్ట్రాల మధ్య ఎగుమతులు లేకపోవడం రైతులకు ఎదురుదెబ్బని చెప్పాలి. అటు ఈ మధ్యనే కురిసిన భారీ వర్షాలకు దిగుమతి సైతం తక్కువే ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు పడిపోతున్నారు. మన్యంలోని పాడేరు మండలం కక్కి, దేవాపురం, సలుగు, ఐనాడ, కొత్తపొలం, ఓనూరు, వంట్లమామిడి తదితర ప్రాంతాల్లో పండే సీతాఫలాలకు మంచి గిరాకీ ఉండేది. ఈ ప్రాంతాల్లో జరిగే వారపు సంతలకు గిరిజనులు సీతాఫలాలను తీసుకువచ్చి విక్రయించేవారు. ఏటా కోల్‌కతాతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, తదితర ప్రాంతాల వ్యాపారులు వచ్చి పోటీ పడి మరీ ఇక్కడ సీతాఫలాలు కొనుగోలు చేసేవారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఇతర ప్రాంతాల వ్యాపారులు రాకపోవడంతో సరైన ధర పలకక గిరిజనులు లబోదిబోమంటున్నారు.

ఈ ఏడాది పంట ఆశాజనకంగా లేకపోవడంతో ధర అధికంగా ఉంటుందని గిరిజనులు ఆశించారు. అయితే వ్యాపారులు మాత్రం సిండికేట్‌ గా మారి కావిడి సీతాఫలాలను వెయ్యి నుంచి పదిహేను వందలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారుల తీరుతో కనీస ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ఒక పక్క కరోనాతో ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ఇతర రాష్ట్రాల వ్యాపారులు మన్యానికి రాకపోవడంతో తక్కువ ధరకు సీతాఫలాలను కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఆదోకోవాలంటూ గిరిజనులు కోరుతున్నారు.

Tags:    

Similar News