ఒంటె పాల ధర లీ. రూ.100.. రైతుల సిరుల పంట

Update: 2021-02-18 03:11 GMT

Camel Milk

ఆవు పాలు, గేదె పాలు , మేక పాలు వీటి గురించి మనకు తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో తరుచుగా ఒంటె పాల గురించే వినిపిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా...ఒంటె పాలతో మనకు పెద్దగా టచ్ లేకపోయినా ఆ టేస్ట్ తెలియక పోయినా ఆ దేశ రైతులకు మాత్రం అవి సిరులు కురుపిస్తున్నాయి. అవును ఒంటె పాల ఉత్పత్తినే ఉపాధి మార్గంగా మార్చుకుని ఆఫ్రికన్ దేశాల రైతులు ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నారు. మరి ఒంటె పాల కహానీ ఏంటో వాటి ద్వారా రైతులు పొందుతున్న లాభాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఒంటె పాల కహానీ ఇప్పుడు మొదలైంది కాదండోయ్ సుమారు 6వేల ఏళ్లుగా ఒంటె పాలను మనుషులు తాగుతున్నారట. ఈ మధ్యకాలంలో మళ్లీ వీటికి ఆదరణ పెరుగుతోంది. అదీ మన అనారోగ్యాల పుణ్యమే అని చెప్పక తప్పదు. ముఖ్యంగా మదుమేహం ఉన్న వారు ఈ పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనితో సౌత్ ఆప్రికా దేశ రైతులకు షుగర్ పేషంట్లే కస్టమర్లుగా మారారు. ఒంటె పాలకు డిమాండ్ పెరగడంతో వాటిని పెంచుతూ పాలను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అక్కడ ఒంటె పాల వాణిజ్యం విలువ ఏడాదికి 10 బిలియన్ డాలర్లపైనే ఉంటుందట. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఒంటె పాలు ఆఫ్రికా దేశాల రైతులకు తెల్ల బంగారంలా మారిందని. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు ఖరీదైనవి. అందుకే ఈ పాల ఉత్పత్తినే ఆదారం చేసుకుని తూర్పు ఆఫ్రికాలోని రైతులు సుమారుగా కోటీ 20 లక్షల ఒంటెలను పెంచుతున్నారు.

ఒంటె పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పాలల్లోనే కాదు వాటి చర్మం మొదలు వేళ్లు, గోర్ల వరకు ప్రతి భాగానికి ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో ఒంటె పాలకు డిమాండ్ పెరిగింది. ఒంటె పాలకు ఏర్పడే డిమాండ్ ను ముందుగానే గుర్తించి 2017 సంవత్సరంలోనే పాలను ప్రాసెస్ చేసే సంస్థను నెలకొల్పారు సౌత్ ఆఫ్రికన్ లు . పాల నిర్వహణపై చాలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఒంటె పాలను నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇక్కడ శీతల గిడ్డంగుల సదుపాయాలు లేపోవడంతో పాలను పొగ సాయంతో నిల్వచేస్తారు. ఇది అక్కడ ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. గ్రామాల్లో రైతుల నుంచి సేకరించిన పాలను ఇలా నిల్వ చేసి పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఎక్కడ పాల అవసరం ఉందో ముందుగా గుర్తించి అందుకు తగ్గట్లుగా పాలను సరఫరా చేస్తారు. ఒంటెల నిర్వహణ ఖర్చు కూడా పెద్దగా ఉండదంటారు రైతులు. మిగతా పశువులతో పోల్చితే ఎడారి ప్రాంతాల్లోనూ ఒంటెలు మనుగడ సాధించగలవంటున్నారు. ఒకవేళ వరుసగా మూడేళ్లు వర్షాలు కురవకపోయినా ఇవి తట్టుకోగలవట.

నిజానికి ఒంటె పాలలో సహజ సిద్ధమైన ఇన్సూలిన్ లాంటి ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ సీ, ఐరన్ తో పాటు చాలా పోషకాలు ఉంటాయి. అందుకే ఈ పాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఈ పాలను టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారు త్రాగడం వల్ల ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి. ఆఫ్రికన్ దేశాలే కాదు మన దేశంలోని గుజరాత్ ప్రాంతంలోనూ సహకార సంఘాలు ఒంటె పాల డెయిరీలను నిర్వహిస్తున్నాయి. దేశమంతా పాలను అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు ఒంటె పాల పౌడర్లను సూపర్ మార్కెట్ ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చూశారుగా ఒంటె పాలకు ఎంత డిమాండ్ పెరిగిందో. ఇదంతా చూస్తే త్వరలోనే మన దేశంలోనూ ఒంటె పాల విప్లవం రావడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ లో షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఒంటె పాల వాడకానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

Full View


Tags:    

Similar News