Black Rice Cultivation: పెట్టుబడి తక్కువ ఆధాయం ఎక్కువ..
Black Rice Cultivation: ఆహారమే తొలి ఔషదం అంటారు. ఒకప్పుడు మన పూర్వికులు వారికి అవసరమైన పోషకాలను అహారధాన్యాల నుంచే పొందేవారు.
Black Rice Cultivation: ఆహారమే తొలి ఔషదం అంటారు. ఒకప్పుడు మన పూర్వికులు వారికి అవసరమైన పోషకాలను అహారధాన్యాల నుంచే పొందేవారు. కానీ కాలం మారింది. వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారంలో పోషకాలు కరువయ్యాయి. రైతులు అధిక దిగుబడులు అందించే వరి రకాల సాగుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ కారణంగా ప్రజల్లో ఆరోగ్యస్పృహ ఎక్కువైంది. సేంద్రియ విధానంలో పండిన పోషకాల పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో కొంతమంది రైతులు వినియోగదారులకు ఆరోగ్యకరమైన, పోషక విలువలు కలిగిన పంటలను అందించేందు కృషి చేస్తున్నారు. ఆ కోవకే వస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు వెంకటేశ్వరరావు. తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో నలుపు రంగు ధాన్యాన్ని సాగు చేస్తూ , తక్కువ ధరకే పొలం వద్దే విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు. తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
నల్ల బియ్యం, ప్రస్తుతం ప్రజల నోళ్లలో నానుతున్న పదం. పోషకాలు అధికంగా ఉన్న ఈ బియ్యాన్ని తినేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే శాస్త్రవేత్తలు పోషక విలువలు కలిగిన కొత్తరకం వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. రైతులు వీటిని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రాపురం గ్రామానికి చెందిన సాగుదారు గొట్టిపాటి వెంకటేశ్వరరావు తనకున్న ఐదు ఎకరాల నేలలో పూర్తి సేంద్రియ విధానంలో నల్ల వరి సాగు చేస్తున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని నలుగురికి పంచుతూ, తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
గొట్టిపాటి వెంకటేశ్వరరావుకి వ్యవసాయంలో 38 ఏళ్ల అనుభవం ఉంది. 1984 నుంచి సేద్యం ప్రారంభించారు ఈ అభ్యుదయ రైతు. అప్పటి నుంచి వివిధ రకాల వంగడాలను పూర్తి సేంద్రియ విధానంలోనే పండిస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రజలు నల్ల బియ్యం తినడానికి ఆసక్తి చూపుతున్నారన్న విషయం తెలుసుకుని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి బీపీటీ 2841 రకం విత్తనాన్ని ఎన్నుకుని శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయడం మొదలు పెట్టారు. ఈ నల్ల వరి సాగులోనూ సేంద్రియ విధానాలను అవలంభిస్తున్నారు. రసాయనిక ఎరువులు నేలలోని పోషకాలను హరింపజేస్తాయని, సేంద్రియ విధానం వల్ల నేలను, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని రైతు తెలిపారు.
సాధారణ వరితో పోల్చితే ఈ వరి సాగు ఖర్చులు తక్కువని రైతు తెలిపారు. 5 వేల రూపాయలతోనే ఎకరం విస్తీర్ణంలో నల్లవరి సాగు చేస్తున్నానని రైతు చెప్పుకొచ్చారు. ఎకరానికి 20 నుంచి 25 బస్తాల దిగుబడిని సాధిస్తూ తక్కువ ధరకే వాటిని స్థానికంగా విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. నల్ల బియ్యంలో పోషకాల విలువలు ఆరోగ్యపరంగా మేలు చేసే గుణాలున్నాయంటున్నారు ఈ సాగుదారు. ప్రతి రైతు కష్టాల సాగును వీటి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందే వంగడాల సాగుకు శ్రీకారం చుట్టాలంటున్నారు.