Wild Boar: అడవి పందుల బెడదకు పెద్దపల్లి జిల్లా రైతు ఉపాయం
Wild Boar: వేలకు వేలు పోసి ఆరుగాలం శ్రమించి రైతు పంటను పండిస్తే, ఉత్పత్తి చేతికొచ్చే దశలో అడవి పందులు నాశనం చేస్తుంటాయి.
Wild Boar: వేలకు వేలు పోసి ఆరుగాలం శ్రమించి రైతు పంటను పండిస్తే, ఉత్పత్తి చేతికొచ్చే దశలో అడవి పందులు నాశనం చేస్తుంటాయి. పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ కరెంటు తీగలు వేయడంతో మూగజీవాలకు తోడు మనుషుల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ప్రాణాపాయం జరుగకుండా అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు పెద్దపల్లి జిల్లా రైతు వినూత్న పరిష్కారాన్ని ఆలోచించాడు. సత్ఫలితాలను సాధిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
విత్తు విత్తింది మొదలు పంట చేతికి వచ్చే వరకు రైతు పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు చీడపీడలు, అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకునేందకు రైతు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. వేలకు వేలుపోసి, కష్టనష్టాలకు ఓర్చి పంట సాగు చేస్తే చివరికి పంట చేతికి అందే సమయంలో అడవి పందులు దాడి చేసి రైతుకు తీరని నష్టాన్ని మిగుల్చుతుంటాయి. ఇలాంటి కష్టమే పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన కుందారం శ్రీనివాస్ అనే రైతుకు ఎదురైంది. ఆ కష‌్టమే రైతు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టేలా చేసింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంలా తన పంటను కాపాడుకునేందుకు మరో పంటను రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకున్నాడు. సత్ఫలితాలను పొందుతున్నాడు.
శ్రీనివాస్ లింగాల గ్రామ శివారులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. గత మూడేళ్లు పత్తి సాగు చేసిన శ్రీనివాస్ అందులో పెట్టుబడులు పెరిగి రాబడి రాకపోవడంతో గత ఏడాది మొక్కజొన్న పంటను సాగు చేశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా పంటకు సరైన ధర రాకపోవడంతో పాటు అడవి పందుల బెడద అధికమవ్వడంతో మరోసారి రైతు తీవ్రంగా నష్టపోయాడు. దీంతో వ్యవసాయాధికారులను ఆశ్రయించిన శ్రీనివాస్ వారి సూచన మేరకు వేరుశెనగ సాగు చేశాడు. అయితే అడవి పందుల బెడద మళ్లీ నష్టాన్ని తెస్తాయని ఆందోళన చెందాడు ఆ కష్టం నుంచి బయటపడేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. వేరుశెనగ పంట చుట్టూ కుసుమ పంటను సాగు చేశాడు. కుసుమ పట్ట వేరుశనగ పంట వాసన కంటే ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించడంతో అడవిపందులు ఈ పంటవైపు రావడం లేదని రైతు చెబుతున్నాడు. ఒకవేళ వచ్చినా కుసుమ పంటకు సన్నని ముళ్లు ఉండటంతో వాటికి గుచ్చుకుంటాయిని తెలిపాడు. పంట చుట్టూ నాలుగు నుంచి ఐదు వరుసల్లో కుసుమ పంట వేసుకున్నట్లు చెబుతున్న శ్రీనివాస్ తద్వారా వేరేశెనగ పంటకి ఇబ్బందులు లేకుండా పోయాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
జిల్లాలో వేరుశనగ చుట్టూ కుసుమ పంట సాగు చేయడం అనేది ఇదే మొదటి సారి అని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కుసుమ పంట వేయడం వల్ల అంతర్లీనంగా ఉన్న వేరుశెనగ పంటకి ఇబ్బందులు లేకుండా ఉండటంతో పాటుగా కుసుమ నూనే కూడా లభిస్తుండటంతో రెండు రకాలుగా రైతు లాభాన్ని పొందుతున్నాడు అని తెలిపారు. ఈ రైతు ప్రయత్నం సత్ఫలితాలు అందిస్తుండటంతో పెద్దపల్లి జిల్లాలోని మిగితా రైతులు కూడా ఇలాంటి ప్రయత్నం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.