Yellow Watermelon: పసుపు పుచ్చ కాయ సాగు.. బహు బాగు..
Yellow Watermelon: ఒక ఆలోచన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. సాగులో విజయం వరించేలా చేసింది.
Yellow Watermelon: ఒక ఆలోచన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. సాగులో విజయం వరించేలా చేసింది. సముద్ర తీరప్రాంతమైన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం కేశనపల్లిలో పసుపు రంగు పుచ్చకాయలు సాగు మంచి ఫలితాలను ఇస్తోంది. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు దొమ్మేటి శ్రీనివాస్ ఎకరం భూమిని కౌలుకు తీసుకుని ప్రయోగాత్మకంగా ఈ సాగు ప్రారంభించారు.
రైతు శ్రీనివాస్ గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. తరవాత స్వదేశానికి తిరిగివచ్చాక వ్యవసాయం మీద మక్కువతో కేశనపల్లి గ్రామంలో భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ కేవలం సరుగుడు సాగుకే పరిమితమైన ఇసుక నేలలో పసుపు రంగు పుచ్చకాయలసాగు ప్రయోగాత్మకంగా చేపట్టాడు అదే విధంగా కర్బూజ పండ్ల సాగు కూడా చేస్తున్నాడు .
గత ఏడాది ఇదే భూమిలో పుచ్చ, గుమ్మడి సాగు చేయగా నష్టం వచ్చింది. అయినా వెనకడుగు వేయకుండా ఈ ఏడాదీ సాగు చేశాడు. ఎకరానికి లక్షా 60 వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాడు శ్రీనివాస్. ఎకరానికి రూ 60 వేలు పెట్టుబడి పోగా లక్ష వరకు లాభన్ని పొందాడు. సాధారణంగా ఎరుపు రంగు పుచ్ఛతో పాటు పసుపు రంగు పుచ్చకాయలు కూడా ఇక్కడ పండాయి. చాలా తీపిగా వుండే కర్బూజా కూడా ఇదే భూమిలో పుచ్ఛతోపాటు ఏకకాలంలో పండించాడు. ఇటువంటి రకాల పుచ్ఛకాయలు ఇప్పటివరకూ కాలిఫోర్నియాలో మాత్రమే సాగయ్యేవని, ఇక్కడ ఇదే తొలిసారని రైతు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఒక్కో పుచ్చకాయ బరువు 8 కిలోలు, కర్బూజా బరువు 4కిలోల వరకు వస్తున్నట్లు రైతు వివరించాడు. సాగు నీటిని డ్రిప్ విధానంలోనే అందించాడు ఈ రైతు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ఉత్సాహంగా సాగు చేసి మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామని రైతు చెబుతున్నాడు.