రుచిలో పుల్లదనం..చూపులకు ఎర్రదనం
చింతకాయంటే పైన పెంకు లేత పచ్చదనంతో కూడిన గోధుమరంగులో లోపల కండ తెలుపు రంగులో, చింతపండంటే పెంకు గోధుమ రంగులో..లోపల కండ తేనె రంగులో ఉంటుందని మనకు తెలుసు.
చింతకాయంటే పైన పెంకు లేత పచ్చదనంతో కూడిన గోధుమరంగులో లోపల కండ తెలుపు రంగులో, చింతపండంటే పెంకు గోధుమ రంగులో..లోపల కండ తేనె రంగులో ఉంటుందని మనకు తెలుసు. అనంత రుధిర అనే రకం చింతకాయ మాత్రం పైన సాధారణ చింతకాయలాగే ఉన్నా లోపల మాత్రం ఎరుపు రంగులో ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంది. చిన్న ముక్క విరిచి రుచి చూస్తే నోరంతా ఎర్రగా మారుతుంది. పచ్చడి చేస్తే పండు మిరపనే తలదన్నేలా ఉంటుంది. అనంతపురం జిల్లా రేగులగుంటలోని ఉద్యాన పరిశోధనా కేంద్రంలో ఈ రకం చింతను చూడొచ్చు. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం గతేడాది ఈ రకాన్ని విడుదల చేసింది. దీనికి అనంత రుధిర అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు.
అనంతపురం జిల్లా రేగులకుంటలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలో తయారైన అనంత రుధిర అనే చింత రకం అబ్బుర పరుస్తుంది. కరువు సీమలో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఎరుపు రంగుతో అధిక పులుపు తో ఉన్న ఈ చింత రకం అధిక దిగుబడి ఇవ్వటంతో పాటు ప్రతి ఏడాది కాపు వచ్చే విధంగా తయారు చేశారు శాస్త్రవేత్తలు. మామూలు చింతతో పోలిస్తే అధిక పోషకాలతో పాటు ఆరోగ్యప్రదాయినిగా ఈ చింత నిలవనుంది.
ఎర్రచింత సాధారణ రకాల మాదిరిగానే నాలుగైదేళ్లలో కాపునిస్తుంది. ఇందులోని కండ ఎర్రగా రక్తవర్ణంలో ఉంటుంది. పండుగా మారే నాటికి ఎర్రదనం కాస్త తగ్గుతుంది. ఏటా జూన్, జులైలో పూత మొదలై ఫిబ్రవరిలో పండు వస్తుంది. సాధారణ రకాలతో పోలిస్తే కాయలు గుత్తులుగా అధిక పరిమాణంలో ఉంటాయి. వంటకాల్లో వాడే కృత్రిమ రంగుల్లో కొన్ని ఆరోగ్యానికి హానిచేస్తాయి. సహజ ఎర్రదనం ఉండే అనంత రుధిర చింతతో పులుపుతోపాటే ఎర్ర రంగు అదనపు లాభం. పప్పులో వాడినా రసంలో వాడినా వంటకం ఎర్రగా కన్పిస్తుంది. పుల్లగా ఎర్రగా ఉండే చాక్లెట్లను, జెల్లీలను ఈ చింతతో తయారు చేస్తే సహజంగానే పులుపురంగుతో కూడిన ఎర్రదనం వస్తుంది.
అనంత రుధిర చింత నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడంపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. చింత తొక్కుతో జామ్, చాక్లెట్లు తయారీపై దృష్టి సారించారు. ఔషధ, పోషక విలువలపైనా అధ్యయనం చేస్తున్నామంటున్నారు ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాసులు.
చింతలో 41 రకాలున్నాయి. వీటికి సంబంధించిన జీవద్రవ్యం విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉంది. ఇందులో నుంచే అరుదైన ఎర్ర చింతను బయటకు తెచ్చారు శాస్త్రవేత్తలు. దశాబ్దాల కిందట అంతరించిపోయిన అనంత రుధిర ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల కృషితో మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీనితో పాటు తెట్టు అమాలికా అనే చింత రకాన్ని విడుదల చేశారు. ఈ చింత ప్రతీ సంవత్సరం కాపుకు రావడంతో పాటు కాయ బరువు అధికంగా ఉంటుంది. రైతుకు అధిక దిగుబడిని ఇస్తుంది అంతే కాదు మార్కెట్‌లోనూ మించి డిమాండ్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వీటితో పాటు మరికొన్ని రకాలు కూడా పరిశీలనలో ఉన్నాయని వాటిని త్వరలో విడుదల చేస్తామంటున్నారు.
అనంత రుధిర రకాన్ని అంటు కట్టి రైతులకూ విక్రయిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కో మొక్క ధర 50 రూపాల చొప్పున నిర్ణయించారు. ఇప్పటికే రెండు వేల మొక్కల వరకు అందించారు. ఈ ఏడాది 30 వేల మొక్కలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అనంతపురం ఉద్యాన కేంద్రంతోపాటు నెల్లూరు, కడప, చిత్తూరు తదితర ప్రాంతాల్లోని ఉద్యాన కేంద్రాల్లోనూ మొక్కలు అందుబాటులో ఉన్నాయి.