Munaga Cultivation: మునగ సాగులో రాణిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా రైతు
Munaga Cultivation: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డి.
Munaga Cultivation: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డి. తనకున్న వ్యవసాయ పొలంలో ఎన్నో ఏళ్లుగా వరి ,జొన్న ,మొక్కజొన్న, పత్తి వంటి పంటలను వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తూ వచ్చాడు. ఓ వైపు చీడపీడలు మరోవైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగులో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. రెక్కలను నమ్ముకుని రేయింబవళ్లు కష్టపడినా పైసా లాభం కాదు కాదా పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. చివరకు అప్పులే మిగిలే దయనీయ పరిస్థితికి చేరుకున్నాడు. అయినా సేద్యంలోనే సాగాలనుకున్న ఈ సాగుదారు ప్రత్నామ్నాయ పంటల వైపు దృష్టి సారించాడు. మునగసాగు చేపట్టాడు లాభాల దిశగా అడుగులు వేస్తున్నాడు.
కర్నూలు జిల్లా నుంచి 60 మునగ మొక్కలను తీసుకువచ్చి తన పొలంలో మొదట ప్రయోగాత్మ సాగు చేపట్టాడు. అప్పట్లో మునగ వినియోగం తక్కువగా ఉండేది. అయితే రాను రాను మునగలోని ఔషధ గుణాలు దశదిశలా వ్యాపించడంతో చాలా మంది మునగను తమ రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. దీంతో సాగుపైన మరింత దృష్టి సారించిన వెంకటరెడ్డి 35 వేల రూపాయల పెట్టుబడితో ఎకరం విస్తీర్ణంలో 500లకు పైగా మొక్కలను పెంచుతున్నాడు.
ఒక్కో మునగ మొక్క నుంచి సీజన్ లో 600 నుంచి 800 రూపాయల వరకు ఆదాయం వస్తుందంటున్నాడు ఈ రైతు. మార్చి, ఏప్రిల్ ,మే నెలలో మంచి దిగుబడులు వస్తాయని ఈ సీజన్ లో ఒక్కో మునగకాయ ధర రూపాయి నుండి రూపాయిన్నర వరకు పలకడంతో మంచి ఆదాయం సమకూరుతోందని రైతు చెబుతున్నాడు. ఇక జూన్ మాసంలో పంట కాలం పూర్తి కావడంతో అడపాదడపా కాసిన కాయలకు మరింత డిమాండ్ పలకడంతో ఒక్కో కాయ ధర రెండు రూపాయల వరకు ఉంటుందని దీంతో ఒక్క ఎకరాకు సుమారు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని రైతు వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం వ్యాపారులు తమ పొలం వద్దకే వచ్చి కాయలను కోసుకొని తీసుకు వెళ్తున్నారని చెబుతున్నాడు. ఇలా 23 ఏళ్లుగా తమకు మునగ పంట మంచి ఆదాయాన్ని అందిస్తోందంటున్నాడు.
మునగలో ఎన్నో పోషకాలు, ఔషధాలు ఉండటంతో తన వ్యవసాయ పొలం నుండి సమీప గ్రామస్తులు మునగ ఆకును మరియు పూతను తీసుకువెళ్ళి మోకాళ్ళ నొప్పులకు వాడుకుంటున్నారని దీంతో మునగ కాయలే కాక, పూత, ఆకులతో కూడా అనేక ప్రయోజనాలున్నాయని రైతు వెంకటరెడ్డి చెబుతున్నాడు. తోటి రైతులు కష్టాల సాగును విడిచి ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారంచాలని ఈ రైతు సూచిస్తున్నాడు.