గత 20 సంవత్సరాలుగా ఆ వ్యవసాయ భూమి రసాయనాలకు అలవాటు పడింది నేలలో సారం కోల్పోయేలా చేసింది. రైతుకు పెట్టుబడులు పెరిగాయి దిగుబడులు తగ్గాయి. ఆదాయం అంతంత మాత్రమే పంటలకు జీవాన్నిచ్చే సూక్ష్మజీవులు సైతం అంతరించిపోయాయి. సాగులో ఎన్నో కష్టాలను, నష్టాలను చూశారు ఆ రైతులు. ఇక సాగులో లాభాలే లేవని భావించి వారికి భరోసాను కల్పించింది ప్రకృతి వ్యవసాయం. సుభాష్‌పాలేకర్ పాఠాలు స్పూర్తిగా ప్రకృతి సాగు చేపట్టారు విజయపథంలో అడుగులు వేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో 10 ఎకరాల పొలంలో ఏకకాలంలో 7 రకాల పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు. తోటి రైతుకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన యువరైతు అమృత్ సాగర్.
యువరైతులు సాగు రంగంలో దూసుకెళుతున్నారు. తాతల కాలం నాటి పద్ధతులను పాటిస్తూ సేద్యంలో కష్టాలను నష్టాలను తరిమికొడుతున్నారు. రసాయనాల సేద్యం మిగుల్చుతున్న చేదు అనుభవవాల నుంచి బయట పడి పెట్టుబడులను తగ్గించుకుని, సాగు రంగంలో రాణిస్తున్నారు. అలాంటి కొవకు చెందిన వాడే అనంతపురం జిల్లాకు చెందిన యువరైతు అమృత్ సాగర్. గత 20 సంవత్సరాలుగా తన తండ్రి హయాంలో రసాయనాలతో చిత్తైన నేలను నేడు పాలేకర్ పద్ధతులను పాటించి సస్యశ్యామలం చేస్తున్నాడు. ఎంతో మంది యువరైతులకు ఆదర‌్శంగా నిలుస్తున్నాడు.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజికుంట గ్రామానికి చెందిన యువరైతు అమృత్ సాగర్. తనకున్న 10 ఎకరాల పొలంలో ఏకకాలంలో ఏడు రకాల పంటలను సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. గతంలో రసాయనిక సేద్యంతో నష్టాలను చవిచూసిన ఈ రైతు పాలేకర్ ప్రకృతి విధానాలను తెలుసుకుని సాగులో లాభాల దిశగా అడుగులు వేస్తున్నాడు.
చాలా మంది రైతులు పెద్దమొత్తంలో ఒకే పంటను సాగు చేసి మార్కెట్‌లో ధర రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఈ రైతు అలా కాదు. 10 ఎకరాలను సమర్థవంతంగా వినియోగించుకుని 7 రకాల పంటలను సాగు చేస్తున్నాడు. ఎకరంన్నర పొలంలో పెద్దకాకర, ఎకరం గోధుమ, అరఎకరం పప్పుశనగ, ఎకరం వేరుశనగ, రెండున్నర ఎకరాల్లో నేరేడు, ఎకరం కంది, ఎకరం వరి ఇలా 10 ఎకరాల్లో 7 రకాల పంటలు సాగులో ఉన్నాయి. వీటన్నింటికీ నూటికి నూరు శాతం ప్రకృతి ఎరువులనే వినియోగిస్తున్నాడు ఈ రైతు.
సుభాష్ పాలేకర్ విధానాలను తు.చ తప్పకుండా పాటిస్తూ సాగులో పెట్టుబడులను తగ్గించుకుని , నాణ్యమైన దిగుబడిని తీస్తూ గ్రామానికే ఆదర్శంగా నిలుస్తున్నాడు అమృత్‌సాగర్. తనకున్న బోర్ ద్వారా సోలార్ పరికరాన్ని ఉపయోగించి డ్రిప్ ద్వారా పది ఎకరాల్లో సాగులో ఉన్న తన పంటలకు నీటిని అందిస్తున్నాడు. ప్రకృతి వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు.
పాలేకర్ సూచించిన ప్రకృతి సాగు విధానంలో దేశీ ఆవులే కీలకం అందుకే మూడు దేశీ ఆవులను కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే వ్యర్థాలతో ప్రకృతి ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకుంటున్నాడు. పెట్టుబడులను తగ్గించుకుంటున్నాడు.
10 ఎకరాల పొలంలో ఎరువులను పిచికారీ చేయాలంటే ఎక్కువ మంది కూలీల అవసరం ఉంటుంది. కానీ స్థానికంగా కూలీల సమస్య అధికంగా ఉండడంతో తానే స్వయంగా రెండు వేల రూపాయల వ్యయంతో ఓ యంత్రాన్ని రూపొందించాడు. ఇప్పుడు కూలీల అవసరం లేకుండా పది ఎకరాల పొలానికి ఏకకాలంలో తక్కవ సమయంలో ఎరువును పిచికారీ చేస్తున్నాడు.
పాలేకర్ ప్రకృతి సాగు విధానాలతో ఈ రైతు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకున్నాడు. నాణ్యమైన దిగుబడిని పొందుతున్నాడు. తద్వారా లాభాదాయకమైన ఆదాయాన్ని పొందడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. ఆదర్శంగా నిలుస్తున్నాడు.