JOBS: ఆశల పల్లకిలో 'క్యాంపస్' కొలువులు
JOBS: కరోనా వేళ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌ని ఆహ్వానిస్తున్నాయి.
JOBS: కరోనా వేళ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌ని ఆహ్వానిస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ చేపట్టేందుకు కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ఈసారి ఐటీ రంగంలో అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్కిల్డ్ విద్యార్థులను సెలెక్ట్ చేసుకునేందుకు కంపెనీలు కసరత్తులు చేస్తున్నాయి. మరీ ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు ఎంత వరకు రాణిస్తారు. కంపెనీలు ఎలాంటి స్కిల్డ్ పర్సన్స్‌ని కోరుకుంటున్నాయి.
గత ఏడాది కాలంగా ఐటీ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. ప్రాజెక్టులు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో కొత్తగా ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అయితే కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్కిల్డ్ విద్యార్థులు లభించడం లేదు. ప్రత్యక్ష బోధన ఆగిపోవడమే ప్రధాన కారణంగా మారింది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగిందని ఐటీ నిపుణులు అంటున్నారు. సరైన సామర్థ్యం లేక 60శాతం మందినే రిక్రూట్ చేసుకున్నాయి కంపెనీలు.
ప్రధాన ఐటీ కంపెనీలు జూన్‌లో దేశవ్యాప్తంగా 1.1 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశముంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం భారీగా ఉద్యోగులను తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ ఏడాది టీసీఎస్‌లో 40 వేలు, ఇన్ఫోసిస్ 25 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. డీఎక్స్ టెక్నాలజీ, మైండ్‌ట్రీ వంటి కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే ఛాన్స్ ఉంది.
గతేడాది అన్ని కంపెనీలు 2.1 లక్షలు ఉద్యోగాలను కల్పించాలని భావించాయి. కానీ 1.2 లక్షల మందినే తీసుకున్నారు. 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగానే మిగిలిపోయాయి. అందుకే ఈ సారి ప్రధానమైన 5 కంపెనీలు మాత్రమే కాకుండా మిగతా కంపెనీల్లో మరో లక్షకు పైగా, గతేడాది మిగిలిపోయిన ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో లభించే అవకాశం ఉంది.
కరోనా సెకండ్ వేవ్ ధాటికి కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థులు చదువులకు దూరమై సమయం వృథా చేసుకుంటున్నారు. ప్రిపరేషన్‌ను గాలికి వదిలేశారు. విద్యార్థులు లాక్‌డౌన్‌తో గ్రామాలకు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు ముందుకొచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా అంటూ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికైనా సమయం వృథా చేసుకోకుండా విద్యార్థులు ప్రిపరేషన్ కావాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచిస్తున్నారు.