Alert: నిరుద్యోగులకి అలర్ట్.. పోలీస్ ఉద్యోగాలకి మరో రెండు రోజులు మాత్రమే గడువు..!
Alert:నిరుద్యోగులకి అలర్ట్.. పోలీస్ ఉద్యోగాలకి మరో రెండు రోజులు మాత్రమే గడువు..!
TS Police Recruitment 2022: తెలంగాణలో ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభం అయింది. చివరి తేది మే 20గా నిర్ణయించారు. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 (సివిల్ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100 పోస్టులున్నాయి).. ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
భారీ ఎత్తున పోలీస్ నియామక ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 6.50 లక్షలు దాటాయి. గడువు ముగిసేనాటికి మరో 1.50 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మే 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైన తొలిరోజే 15,000 దరఖాస్తులు నమోదు కావడంతో పోటీ అధికంగా ఉంటుందని మండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2018 ఉద్యోగ ప్రకటనలో 18 వేల ఉద్యోగాలకుగాను 7.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చివరి నాలుగు రోజుల్లో దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి ఆరు నోటిఫికేషన్లలోని మొత్తం 17,281 పోస్టుల్లో 16,694 కానిస్టేబుల్ స్థాయిలోనివే కావడం గమనార్హం. మొత్తం పోస్టుల్లో అత్యధికం ఇవే కావడంతో పోటీ సైతం వీటికే నెలకొంది. ఈసారి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సుమారు 5-6 లక్షల దరఖాస్తులు వస్తాయని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) అంచనా వేస్తోంది. ఈ పోస్టులు జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో స్థానికత అంశం కీలకంగా మారింది.