TS TET: టెట్‌ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

TS TET: ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు టీ-సర్కార్ ఆమోదం

Update: 2024-03-15 03:20 GMT

TS TET: టెట్‌ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

TS TET: రాష్ట్రంలో TET నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే.. డీఎస్సీకి ముందే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మే 20 నుంచి జూన్‌ 3 మధ్యలో సీబీటీ జరగనున్నాయి. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తాజాగా టెట్‌ నిర్వహించకపోవడం వల్ల డీఎస్సీ-2024కు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతామని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు.

నిరుద్యోగుల ఆందోళనలపై స్పందించిన సర్కారు.. డీఎస్సీకి ముందే వీలైనంత త్వరగా మరో టెట్‌ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో డీఎస్సీ రాసే వారి సంఖ్య భారీగా పెరగనుంది. వీలైనంత ఎక్కువ మందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. టెట్‌లో వచ్చిన మార్కులకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టులో 20 శాతం వెయిటేజీ ఇస్తున్నందున దీనికి భారీగా డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించడంతోపాటు.. దరఖాస్తు గడువునూ పెంచింది. ఈ మేరకు జులై 17 నుంచి 31 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ వెల్లడించారు. అలాగే ఏప్రిల్‌ 4 వరకు ఉన్న దరఖాస్తును గడువును జూన్‌ 20 వరకు పొడిగించామని ప్రకటించారు. తాజాగా టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో పొడిగించినట్లు వెల్లడించారు.

మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Tags:    

Similar News