Singareni Jobs: నిరుద్యోగులకి గమనిక.. నేటి నుంచి సింగరేణి పోస్టులకి దరఖాస్తులు షురూ..!
Singareni Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతరలో భాగంగా సింగరేణి నుంచి క్లర్క్ నోటిఫికేషన్ విడుదలైంది.
Singareni Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతరలో భాగంగా సింగరేణి నుంచి క్లర్క్ నోటిఫికేషన్ విడుదలైంది. 177 ఎక్స్‌టర్నల్ క్లర్కు పోస్టులని భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ బలరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్స్/ ఐటీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్స్‌లో డిగ్రీ/ డిప్లొమా/6 నెలల సర్టిఫికెట్ కోర్సు చేసిన వారు అర్హులు.
అభ్యర్థుల గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాల్లో 95శాతం స్థానిక అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ (ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన) అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్ రిజర్వుడ్ కోటా కింద ఓపెన్ టు ఆల్ (తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థుల)కు అవకాశం కల్పిస్తారు.
రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తామని సంస్థ డైరెక్టర్ శ్రీ ఎన్.బలరామ్ తెలిపారు. ఈనెల 20 నుంచి జూలై 10వరకు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఈనోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం సింగరేణి వెబ్‌సైట్‌ని www.scclmines.com సందర్శించవచ్చు.