SBI PO Recruitment 2023: బ్యాంకు ఉద్యోగం పొందడానికి సువర్ణవకాశం.. స్టేట్ బ్యాంకు నుంచి 2000 ఖాళీలు..!
SBI PO Recruitment 2023: బ్యాంకులో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI PO Recruitment 2023: బ్యాంకులో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2000 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.inకి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ప్రక్రియ 7 సెప్టెంబర్ 2023 నుంచి ప్రారంభమైంది. చివరి తేది 27 సెప్టెంబర్ 2023గా నిర్ణయించారు. ఫీజు డిపాజిట్ చేయడానికి చివరి తేదీ కూడా ఇదే అని గుర్తుంచుకోండి. ఈ ఉద్యోగాల కోసం పరీక్ష నవంబర్‌లో నిర్వహిస్తారు. మొత్తం 2000 పోస్టులలో జనరల్ కేటగిరీకి 810, ఓబీసీకి 540, ఈడబ్ల్యూఎస్‌కు 200, ఎస్సీకి 300, ఎస్టీకి 150 పోస్టులు కేటాయించారు.
ఎస్బీఐ పీవో అర్హత, వయస్సు
స్టేట్ బ్యాంక్‌లో పీవో కావడానికి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితి గురించి మాట్లాడితే 21 ఏళ్లు నిండి 30 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
SBI జాబ్ అప్లికేషన్ విధానం
1. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించాలి.
2. తర్వాత వెబ్‌సైట్ హోమ్ పేజీలో ప్రస్తుత ఖాళీల లింక్‌పై క్లిక్ చేయండి.
3. తర్వాత SBI ప్రొబేషనరీ ఆఫీసర్స్ PO రిక్రూట్‌మెంట్ 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
4. తదుపరి పేజీలో ఆన్‌లైన్ అప్లై లింక్‌పై క్లిక్ చేయాలి.
5. అభ్యర్థించిన వివరాలని పూర్తిగా అందించాలి.
6. రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తు ఫారమ్ నింపాలి.
అప్లై చేయడానికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.750 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఎటువంటి రుసుము లేదు. మరింత సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ ఒక్కసారి పరిశీలించండి.