ఆ ఉద్యోగాలపై ఏఐ కత్తి..డేంజర్ జోన్ లో ఉన్న జాబ్స్ ఇవే..
AI: ఏఐ వల్ల రానున్న రోజుల్లో ఎంతో మంది ఉద్యోగాలు పోతాయంటే చాలా మంది పెద్దగా నమ్మలేదు. కానీ, ఎప్పుడైతే చాట్ బాట్ చాట్ జీపీటీ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అన్ని రంగాలవారిలో ఆందోళన మొదలైంది.
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వల్ల మానవ మనుగడకే ముప్పు ఏర్పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ వల్ల రానున్న రోజుల్లో ఎంతో మంది ఉద్యోగాలు పోతాయంటే చాలా మంది పెద్దగా నమ్మలేదు. కానీ, ఎప్పుడైతే చాట్ బాట్ చాట్ జీపీటీ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అన్ని రంగాలవారిలో ఆందోళన మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్ మన్ శాక్స్ ఇప్పటికే అంచనా వేసింది. ఏఐ వల్ల డేంజర్ జోన్ లో ఉన్న ఉద్యోగ రంగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏఐ వల్ల ప్రభావితం అయ్యే ఉద్యోగాలు:
ఎంట్రీ లెవల్ అడ్మిన్ రోల్స్: అడ్మినిస్ట్రేషన్ రంగంపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ విభాగానికి సంబంధించి నోట్స్ రాయడం, తప్పొప్పులు చూడడం, స్ప్రెడ్ షీట్స్ ను మెయింటేన్ చేయడం ఇవన్నీ చాట్ జీపీటీ విజయవంతంగా చేస్తోంది. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన కోపైలట్ ఫీచర్ కూడా ఇలాంటిదే.
డేటా ఎంట్రీ క్లర్క్స్
డేటా ఎంట్రీ క్లర్క్స్ పై ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైనాన్షియల్, డేటా అనాలసిస్ మెడికల్ ఫీల్డ్ లో డయాగ్నోసిస్ వంటి జాబ్స్ చేస్తున్న వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పదు. ఏఐ రంగప్రవేశంతో డేటా ఎంట్రీ ఫీల్డ్ లో మానవ వనరుల వినియోగం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.
కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్
కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. వీరి స్థానాన్ని ఏఐ భర్తీ చేయనుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏఐ సహాయాన్ని తీసుకుంటున్నాయి.
లీగల్ అసిస్టెంట్స్
ఏఐ వల్ల ఉద్యోగులకు వేటు పడే రంగంలో న్యాయరంగం కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటికే ఏఐ ప్రభావం ఈ రంగం పై మొదలైంది. ఏఐ ఆధారిత లీగల్ అసిస్టెంట్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి.
జర్నలిజం
జర్నలిజం పై కూడా ఏఐ కత్తి వేలాడుతోంది. కంటెంట్ రైటర్లు, ఎడిటర్ ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా ఉంది. చాట్ జీపీటీ వంటి చాట్ బాట్స్ వల్ల కంటెంట్ రైటర్లకు డిమాండ్ లేకుండా పోతుంది. ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లు ఏఐని ఉపయోగిస్తూ వార్తలు ఇస్తున్నాయి.
గ్రాఫిక్ డిజైనర్స్
సోషల్ మీడియా రాకతో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి గిరాకీ ఏర్పడింది. అయితే ఏఐ వారి పై కూడా కత్తి కట్టింది. ఇప్పటికే డాల్-ఈ వంటి గ్రాఫిక్ ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇలాంటి టూల్స్ మరిన్ని మార్కెట్ లోకి దిగితే గ్రాఫిక్ డిజైనర్లకు పనిలేకుండా పోతుంది.
ఆర్థికరంగం
బ్యాంకింగ్ రంగంపై కూడా ఏఐ ప్రభావం గట్టిగానే ఉంది. ఫ్రంట్ ఆఫీస్ జాబ్స్ కు గ్యారెంటీ లేదు. కేవలం ఫ్రంట్ ఆఫీస్ అని కాదు అన్ని విభాగాలపై ఏఐ తన పట్టు ప్రదర్శించడం ఖాయం. అలాగే ఫ్యాక్ట్ చెక్కర్లు గా కూడా ఏఐ పని చేస్తుంది. సమాచారాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయాలంటే మనుషులకు గంటలకొద్దీ సమయం పడుతుంది. అదే ఏఐ ఆధారిత టూల్స్ అందుబాటులోకి వస్తే ఆ పని క్షణాల్లో పూర్తవుతుంది. ఈ దిశగా టూల్స్ అభివృద్ధిని చేయడం ఇప్పటికే మొదలు పెట్టేశారు.
మొత్తంగా ఏఐ ప్రభావం అన్ని రంగాలపై పడనుంది. రాబోయే రోజుల్లో చోటుచేసుకునే పెను మార్పులకు అనుగుణంగా యువతరం ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్తతరం సాంకేతికతను నేర్చుకొని సంసిద్ధంగా ఉండాలి.