ప్రేమికులపై దాడులు ఆగడం లేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారిని కుటుంబ పెద్దలు వదలడం లేదు. మిర్యాలగూడు, ఎర్రగడ్డ తర్వాత కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. కుమార్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. దీంతో వారి ప్రేమను అంగీకరించని అమ్మాయి తరపు బంధువులే కుమార్‌ను హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ప్రియుడు మరణంతో అమ్మాయి కన్నీరుమున్నీరవుతోంది. మృతదేహం దగ్గరే కూర్చోని గుండెలు బాదుకుంటోంది. కుమార్ లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక రోదిస్తోంది. ఇటు ఘటనా స్థలికి చేరుకున్న కుమార్ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు.
ఇటు కుమార్ హత్యపై గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామంలో ఆందోళన చేపట్టిన స్థానికులు పోలీసు వాహనంపై విరుచుకుపడ్డారు. వాహనం అద్దాలను పగులగొట్టారు. అమ్మాయి తరపు బంధువులే కుమార్‌ను హత్య చేశారని ఆరోపిస్తూ ఆందోళన ఉధృతం చేశారు.