జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక తెస్తానని చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మధ్య జరిగిన తన పార్టీ టీఆర్ఎస్ ప్లీనరీలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. హైదరాబాద్ నుంచే రాజకీయ భూకంపం తెస్తానని అన్నారు. కానీ.. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధమైన పోకడలకు ఆయన పోతున్నట్టుగా ఇటీవలి పరిమాణాలు కనిపిస్తున్నాయి.
రాజకీయంగా భూ కంపం తెస్తానని చెబుతున్న కేసీఆర్ ను.. కాంగ్రెస్ నేతలు కూడా ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. జాతీయ స్థాయిలో పోటీ సంగతి సరే.. అసలు అందుకు సరిపడా అభ్యర్థులు ఉన్నారా? కలిసి వచ్చే వారిపై స్పష్టత ఉందా? ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు? అంటూ ప్రశ్నల పరంపరను సందర్భం వచ్చినప్పుడల్లా కొనసాగిస్తూనే ఉన్నారు. వాటికి సమాధానాలు మాత్రం చెప్పకుండా.. పర్యటనల మీద పర్యటనలను కేసీఆర్ కానిచ్చేస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ తానే.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. తర్వాత.. బెంగళూరు వెళ్లి దేవెగౌడను కలిశారు. ఇప్పుడు చెన్నై వెళ్లి కరుణానిధిని కలుస్తానని చెప్పారు. కానీ.. ఇదే పార్టీలకు సంబంధించి.. ఈ మధ్యే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ కు ఇప్పటికే డీఎంకే దగ్గరగా ఉంది. అలాగే.. రేపోమాపో సీఎం కేసీఆర్ ను కలుస్తారని ప్రచారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా యూపీయేలో భాగంగా ఉంది.
ఇంతటి స్పష్టమైన రాజకీయ సమీకరణాలు ఉన్నపుడు.. కేసీఆర్ ఈ పార్టీలను కలిసి.. అనుకున్న ఫలితాన్ని సాధిస్తారా? ఒకవేళ అద్భుతం జరిగి సాధిస్తే.. తాను అనుకున్నట్టుగానే హైదరాబాద్ నుంచి భూ కంపాన్ని సృష్టించగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రస్తుతానికైతే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. ముందు ముందు.. ఇది తెలంగాణ రాజకీయాలను ఏ మలుపులకు తీసుకువెళ్తుందన్నదీ ఆలోచనాస్పదంగా మారుతోంది.