ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మళ్లీ పోరు ప్రారంభించంది. నాలుగున్నరేళ్లుగా రాష్ర్టంలో రకరకాల ఆందోళనలు, నిరసనలతో ఉద్యమించిన వైఎస్సార్ సీపీ హస్తిన వేదికగా గర్జించేందుకు సిద్ధమైంది. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన దీక్ష చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచకుండా రాష్ట్రాన్ని వంచనకు గురిచేసిన కేంద్రంపై కదం తొక్కడానికి వైస్సార్సీపీ మరోసారి సిద్ధమైంది. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టిన వైసీపీ మరోసారి హస్తిన వేదికగా ప్రజల ఆకాంక్షను వినిపించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి పోరుబాటు పట్టారు. గురువారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన దీక్ష చేపట్టనున్నారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్.జగన్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి హస్తిన వేదికగా మరోసారి గళం వినిపించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
విభజన చట్టంలో రూపొందించిన అంశాలతో పాటు..ప్రత్యేక హోదాను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారంటున్న వైసీపీ నేతలు ‘వంచనపై గర్జన’ దీక్ష ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. మరో వైపు ఎన్‌డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని కూడా ఎండగట్టనున్నారు. విశాఖ, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కాకినాడ వేదికగా చేపట్టిన వంచనపై గర్జనలో గొంతెత్తి నిలదీసిన వైసీపీ నేతలు హస్తిన బాట పట్టారు.