దేశవ్యాప్తంగా తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అందుకు కారణం ప్రతిపక్షాలు కలిసి ఉమ్మడిగా పోటీ చెయ్యడమే.. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో తొమ్మిదిన్నర నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళుతున్నారు కేసీఆర్. అయితే మొదట్లో దృష్టంతా తెరాసవైపే ఉన్నా.. తరువాత సీన్ మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. టీడీపీ, జనసమితి, సిపిఐలను కలుపుకుని ప్రజకూటమి ఏర్పాటు చేసింది. దాంతో మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలో బీజేపీ మాత్రం ఒంటరైపోయింది.
పొత్తులకోసం చివరివరకు ప్రయత్నించిన బీజేపీ ఆఖరికి ఒకే ఒక్క సీటులో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో కూటమికి 15 సీట్లకు మించి రావని చెబుతున్న టీఆరెస్.. తాము 100 కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని ధీమాగా చెబుతోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత.. అందరూ కలిసి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రోజుకు ఐదేసి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తే.. హరీష్ రావు, కవిత లు రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రజకూటమి అధికారంలోకి రావడం పక్కా అని చెబుతున్నారు. 80 నుంచి 90 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. రెండు రోజులకోసారి కాంగ్రెస్ అగ్రనేతలు.. పార్టీకి చెందిన సినీ నటులను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది. ఇక కూటమిలో భాగస్వామి అయిన టీడీపీకి పెద్దదిక్కుగా చంద్రబాబు ఉన్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి కాంగ్రెస్, టీడీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రెండు దఫాలుగా ప్రచారం నిర్వహించారాయన.
ఇక బీజేపీ తెలంగాణలో కింగ్ మేకర్ గా మారాలని ప్రయత్నిస్తోంది. 118 సీట్లలో పోటీచేస్తున్న కమలనాథులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సొంతంగా అధికారంలో వస్తారని వారు అనుకోకున్నా.. నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. గతంలో గెలిచిన గోషా మహల్, ముషీరాబాద్, అంబర్ పేట్, ఉప్పల్, ఖైరతాబాద్లో మళ్లీ గెలవడంతో పాటు.. అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. ప్రచారాన్ని హోరెత్తించడం కోసం బీజేపీ అగ్రనేతలు రంగంలో దించింది. ప్రధాని మోడీ, అమిత్ షా, సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, రమణ్ సింగ్, యెగి ఆధిత్యానాథ్ సహా జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న నాయకులంతా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.
ఇకపోతే రాష్ట్రంలో మరో ముఖ్యమైన పార్టీ 'మజ్లీస్'.. వీరు కూడా 10 సీట్లు సాధిస్తే ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటామని చెబుతున్నారు. ఇందులో తమకు కర్ణాటకయే ఆదర్శం అని అక్బరుద్దీన్ ఒవైసి అంటున్నారు. 25 సీట్లు గెలిచిన జేడిఎస్ కర్నాటకలో సీఎం పదవి సాధించింది. 119 సీట్లున్న తెలంగాణలో 8 గెలిస్తే మేం కూడా సీఎం అవుతామంటూ అక్బర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంస్యమయ్యాయి. ఎందుకైనా మంచిదని తెరాసకు కూడా వీరు టచ్ లో ఉన్నారు. తాము పోటీ చేసే స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో టీఆరెస్ కు మద్దతు పలికింది మజ్లీస్ పార్టీ.
ప్రధానపార్టీలు విజయావకాశాలు ఎలా ఉన్నా… హంగ్ వస్తే పరిస్థితి ఏంటి? వస్తే కాదు.. వస్తుంది… అని బీజేపీ, మజ్లీస్ అంటున్నాయి. స్వంతంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీఆరెస్ అంటుంది. కాదు కాదు.. ప్రజకూటమే అధికారం చేపడుతుందని ఘంటాపదంగా చెబుతోంది కాంగ్రెస్. మరి ఎవరి జాతకం ఎలా ఉండబోతుందో డిసెంబర్ 11 న తేలనుంది.