ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్ధాయిలో దూకుడు పెంచాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా తొలి విడత అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలని భావిస్తున్న పీసీసీ మహా కూటమి ఏర్పాటు, పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై అధిష్టానంతో చర్చిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 11 గంటలకు అధినేత రాహుల్‌తో సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో తాజా పరిస్ధితి, పొత్తుల్లో భాగంగా వివిధ పార్టీలో కోరుతున్న సీట్లు, నియోజకవర్గాలు, కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై రాహుల్‌తో ప్రత్యేకంగా చర్చించనున్నారు. దీంతో పాటు రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించే అంశంపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిద్ధం చేసిన అభ్యర్ధుల జాబితాను అధిష్టానానికి అందజేసి అమోదం కోరే అవకాశాలున్నాయి. అధినేత ఆమోదిస్తే ఈ రోజు సాయంత్రానికి 30 నుంచి 40 మందితో కూడిన తొలి విడత జాబితాను విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో అధినేత రాహుల్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు పలువురు ప్రముఖులు పార్టీలో చేరనున్నట్టు సమాచారం.