భారత వైమానిక దళం (ఐఎఎఫ్) అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మిస్సైల్ ఇది. ఆకాశంలో దృశ్యగోచర ఆవలి లక్ష్యాలను ఛేదించే అత్యంత అధునాతన క్షిపణి అస్త్రను భారత్ విజయవంతంగా పరీక్షలు పూర్తిచేసుకున్నది. బంగాళాఖాతంపై వరుసగా నాలుగు రోజుల్లో ఏడుసార్లు జరిగిన ఈ ప్రయోగాలు అద్భుతంగా సాగాయి. దీంతో ఈ క్షిపణి అభివృద్ధి దశ పూర్తయింది. ఇక భారత వైమానిక దళంలో చేరడమే తరువాయి.
ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)ను, వైమానిక దళాన్ని, పరిశ్రమలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రాన్ని ఈ నెల 11-14 మధ్య ఒడిశాలోని చాందీపూర్ తీరానికి చేరువలో పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి పరీక్షలు జరిగాయి. ఈ అస్త్రానికి.. పైలట్హ్రిత విమానాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పరీక్షల్లో భాగంగా చాలా దూరంలో, ఒక మోస్తరు దూరంలో ఉన్న పలు లక్ష్యాలను ఛేదించేందుకు ఏకకాలంలో బహుళ ప్రయోగాలనూ నిర్వహించారు. ముఖ్యంగా రెండు క్షిపణులను వాస్తవ యుద్ధ రీతిని అనుకరిస్తూ వార్హెడ్లను అమర్చి పరీక్షించారు. అటూఇటూ కదులుతూ వినాస్యాలు చేసుకుంటూ వెళుతున్న లక్ష్యాలనూ ఇది విజయవంతంగా ఛేదించింది.
హైదరాబాద్‌లోనే అస్త్ర అభివృద్ధి
ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్) అభివృద్ధి చేసింది. వైమానిక దళం ఇందుకు తోడ్పాటును అందించింది. ఈ అస్త్రంలోని అత్యంత కీలకమైన ఆర్‌ఎఫ్ సీకర్తో పాటు అధునాతన ఏవియానిక్స్ వ్యవస్థలను హైదరాబాద్‌లోని డీఆర్డీవో అనుబంధ సంస్థ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) రూపొందించింది. ఈ సీకర్ను లోగడ దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. తాజా పరీక్షల్లో ఈ స్వదేశీ సీకర్ అత్యంత కచ్చితత్వంతో పనిచేసింది. అస్త్ర కోసం అభివృద్ధి చేసిన అనేక సాంకేతిక పరిజ్ఞానాలు.. భవిష్యత్‌లో గగనతలం నుంచి గగనతలంలోకి, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అనేక క్షిపణుల అభివృద్ధికి ఉపయోగపడతాయని క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల విభాగం డైరెక్టర్ జనరల్ జి.సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. అస్త్ర ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎస్.వేణుగోపాల్ నేతృత్వంలో జరిగాయి.
ఇక ఈ క్షిపణి సామర్థ్యాలను పరిశీలిస్తే ఒకే ప్రయోగంతో శత్రు యుద్ధవిమానాన్ని నేలకూల్చే.. ‘సింగిల్ షాట్ కిల్ ప్రాబబిలిటీ సామర్థ్యం ఈ క్షిపణిలో ఉన్నాయి. అందువల్ల ఇది అత్యంత విశ్వసనీయ అస్త్రంగా మారనున్నది. ఎలాంటి వాతావరణంలోనైనా ఇది పనిచేస్తుంది. పొగరాని చోదక వ్యవస్థ దీని సొంతం. బహుళ లక్ష్యాలను ఛేదించే క్రమంలో ఇది అత్యంత సమర్థమైంది. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. ఈ క్షిపణి లక్ష్యాలను గుర్తించి, వాటి గమనంపై కన్నేసి ఉంచగలదు. ఇందులో ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ఏర్పాటు ఉండటం వల్ల శత్రు రాడార్ల నుంచి వచ్చే సంకేతాలను అడ్డగిస్తుంది. ఫలితంగా ఈ క్షిపణి గమనాన్ని శత్రు దేశాలు పరిశీలించడం చాలా కష్టం. 3.8 మీటర్ల పొడవు గల ఈ అస్త్ర క్షిపణి 154 కిలోల బరువు ఉంటుంది. వార్ హెడ్‌గా 15 కిలోల బరువైన పెను విస్ఫోటనం వినియోగిస్తారు.