కొడంగల్‌లో నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. రేవంత్‌రెడ్డితోపాటు ఆయన అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తుండటంతో రేవంత్ అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ, తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలీసులు అనవసరంగా తమపై భౌతిక దాడులు చేస్తున్నారంటూ రేవంత్ అనుచరులు మండిపడ్డారు. కాగా రేవంత్ ముఖ్య అనుచరులైన మహ్మద్ యూసఫ్, నందారం ప్రశాంత్ తదితరుల ఇళ్లలో మఫ్టీ పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద ఏమీ దొరకకపోవడంతో పోలీసులు సామగ్రిని చిందరవందరగా పడేశారని వారు ఆరోపించారు.