రెండు దశాబ్దాల కిందట శంకుస్థాపన చేసిన భారత దేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెన సుమారు 21 ఏళ్ల తరువాత ప్రారంభం అవుతోంది. దాని పేరే బోగీబీల్ వంతెన. దీని నిర్మాణానికి 1997లొ అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ శంకుస్థాపన చేశారు. తర్వాత 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులను ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా మంగళవారం ఈ వంతెనను ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. ఈ వంతెన నిర్మాణం కోసం రూ.5,920 కోట్ల రూపాయలను వెచ్చించారు. వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు, పై భాగంలో మూడు లైన్ల రహదారి ఉంటాయి. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామగ్రిని తరలించే అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా దీన్ని నిర్మించారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన వల్ల అసోంలోని తిన్‌సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్ల్‌గన్ పట్టణాలకు 500 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు దూరం తగ్గనుంది.