కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో సిఎం కెసిఆర్ సమావేశం ముగిసింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు ఆదివారం నుంచే ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా తాను ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశంలో కూడా చర్చించానన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. త్వరలోనే పటిష్ట ప్రణాళికతో ముందుకొస్తామని చెప్పారు. మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయని కెసిఆర్ స్పష్టం చేశారు. మరికొద్ది సేపట్లో కెసిఆర్ ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు మూడ్రోజులు అక్కడే మకాం వేయనున్నారు. ఈనెల 26 లేదా 27న భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.